Tammineni veerabhadram: బీజేపీ గెలవగలిగేచోట మేం పోటీ చేయం... అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్‍‌లకే మా ఓటు: తమ్మినేని వీరభద్రం

  • కాంగ్రెస్ గెలవగలిగిన చోట ఆ పార్టీకి, బీఆర్ఎస్ గెలవగలిగే చోట ఆ పార్టీకి మా ఓటు అని వెల్లడి
  • తెలంగాణలో బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవకుండా చేయడమే తమ నినాదమన్న తమ్మినేని
  • కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ దేవుడు లేని దేవాలయం వంటిదన్న సీపీఎం నేత
Tammineni says cpm will not contest in which bjp may win

కాంగ్రెస్ పార్టీతో ఇంత అవమానకర పరిస్థితుల్లో పొత్తుకు వెళ్లలేమని చెబుతూనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే చోట మాత్రం అక్కడ గెలవగలిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు విఫలమైనట్లు ఆయన గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ గెలుపుకు అవకాశమున్న సీట్లలో అక్కడ ఏ పార్టీ గెలవగలిగితే ఆ పార్టీకి ఓటేస్తామన్నారు. బీజేపీపై కాంగ్రెస్‌కు గెలిచే సత్తా ఉంటే ఆ పార్టీకి, బీఆర్ఎస్ గెలిచే సత్తా ఉంటే అదే పార్టీకి ఓటేస్తామన్నారు. కానీ బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనీయకూడదనేది తమ నిర్ణయమన్నారు.

బీజేపీ గెలిచే పరిస్థితి ఉన్నచోట తాము పోటీ చేయమని, అక్కడ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌ ఎవరికి బలం ఉంటే వారిని గెలిపిస్తామన్నారు. తమ మొదటి స్లోగన్ ఇదే అన్నారు. రెండో స్లోగన్ సీపీఎం, సీపీఐలను గెలిపించాలి... మూడోది వామపక్ష ప్రజాతంత్ర సామాజిక లౌకిక పోరాట శక్తులు ఎక్కడున్నా గెలిపించాలి... అనేవి తమ నినాదాలు అన్నారు. మొత్తానికి తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే అన్నారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరు తమ ప్రత్యర్థులే అన్నారు. సమస్యల దృష్ట్యా బీఆర్ఎస్ తమ ప్రత్యర్థి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించడం తమ ప్రధాన లక్ష్యం కాదని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏ పార్టీ అయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామన్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలని, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ దేవుడు లేని దేవాలయం వంటిదన్నారు.

More Telugu News