Komatireddy Venkat Reddy: లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇచ్చేది లేదు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • కమ్యూనిస్ట్‌లకు నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారన్న కోమటిరెడ్డి
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారికి రెండు ఎమ్మెల్సీలు, రెండు మంత్రి పదవులు ఇస్తామని వెల్లడి
  • వారికి సీట్లు ఇస్తే వాటిని బీఆర్ఎస్ గెలుచుకునే ప్రమాదం ఉందన్న కోమటిరెడ్డి
  • సర్వేలు హంగ్ అంటున్నాయి... అప్పుడు ఈ నాలుగు సీట్లు కూడా ముఖ్యమని వెల్లడి
Komatireddy sensational comments on alliance with communist parties

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-కమ్యూనిస్ట్ పార్టీల పొత్తు అంశం ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. కమ్యూనిస్ట్‌లు కోరుకున్న పలు స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో లెఫ్ట్ పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. తమకు ఏ సీట్లు ఇస్తారు.. ఎన్ని ఇస్తారో చూద్దామని లెఫ్ట్ పార్టీలు వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటు, పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 

లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీలకు నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారని వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో హంగ్ అసెంబ్లీ వస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. అవసరమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వంలో రెండు లెఫ్ట్ పార్టీలకు చెరో ఎమ్మెల్సీని కేటాయిస్తామన్నారు. అలాగే వారిని కేబినెట్లోకి తీసుకొని, రెండు మంత్రి పదవులు ఇస్తామన్నారు. తమ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తాను ఇదే విషయం చెప్పానన్నారు. ఆయన టీవీ9తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కమ్యూనిస్ట్ పార్టీలు మనకు లోక్ సభ ఎన్నికల్లో చాలా అవసరమని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వారికి నాలుగు సీట్లు కేటాయిస్తే వాటిని బీఆర్ఎస్ గెలుచుకునే ప్రమాదం ఉంటుందని, అందుకే అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీలు ఇస్తామని అధిష్ఠానం ముందు చెప్పానన్నారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్ కు 75 సీట్లు వస్తాయని భావిస్తున్నానని, కానీ కొన్ని సర్వేలు హంగ్ అంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాలుగు సీట్లు కూడా ముఖ్యమని, అప్పుడు కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందన్నారు. వారు సీట్లు అడిగితే ఇచ్చేది లేదని, సీట్లు అడిగితే కనుక తాము పొత్తుకు వ్యతిరేకమన్నారు.

More Telugu News