Delhi Filmmaker: ప్రమాదంలో గాయపడి రోడ్డుపై రక్తపుమడుగులో ఫిల్మ్‌మేకర్.. చోద్యం చూసిన జనం.. కెమెరా, మొబైల్‌ఫోన్ చోరీ!

  • సౌత్ ఢిల్లీలోని పంచ్‌శీల్ ఎన్‌క్లేవ్‌లో ఘటన
  • రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం
  • చుట్టూచేరి ఫొటోలు, వీడియోలు తీసిన జనం
  • రక్తమోడుతున్నా కనికరించని వైనం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Left Bleeding On Road After Bike Crash Delhi Filmmaker Dies and his Phone and GoPro Stolen

సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి దేశ రాజధానిలో జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డుపై రక్తపు మడుగులో పడివుంటే చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. అంతటితో ఆగలేదు. అతడి ‘గోప్రో’ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన. బాధితుడిని డాక్యుమెంటరీ ఫిల్మ్ ‌మేరకర్ పీయూష్ పాల్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్టోబరు 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో పీయూష్ బైక్‌ (30)పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో పీయూష్ అల్లంత దూరం ఎగిరిపడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఉంటూ గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పీయూష్ పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవారు స్పందించి ఉంటే ఆయన బతికి ఉండేవాడని పీయూష్ స్నేహితుడు తెలిపారు.

రక్తమోడుతూ రోడ్డుపై విలవిల్లాడుతున్న పీయూష్ చుట్టూ మూగిన జనం ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. దాదాపు 20 నిమిషాలపాటు పీయూష్ అలాగే రోడ్డుపై పడి వున్నాడని, ఆయన శరీరంలోని రక్తం మొత్తం పోయిందని పేర్కొన్నాడు. మరోవైపు, ఆయన చుట్టూ గుమిగూడిన జనంలో ఎవరో పీయూష్ మొబైల్ ఫోన్, గో-ప్రొ కెమెరా చోరీ చేశారని తెలిపాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వెనక నుంచి వచ్చి పీయూష్‌ను ఢీకొట్టిన బైకర్‌‌ను బంటీగా గుర్తించి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News