Rahul Gandhi: రెండు శాతం ఓట్లు కూడా సంపాదించలేని బీజేపీ అలాంటి హామీ ఇవ్వడం విడ్డూరం: రాహుల్ గాంధీ ఎద్దేవా

  • బీజేపీ తీరు ఎలా ఉందంటే అమెరికాకు ప్రెసిడెంట్‌గా ఓబీసీని చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా
  • బీజేపీకి అండగా ఉండేందుకే మజ్లిస్ పార్టీ పలుచోట్ల పోటీ చేస్తుందని ఆరోపణ
  • జైహింద్... జై తెలంగాణ అంటూ ప్రసంగం ముగించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi satires on BJP

తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ చెబుతోందని, కానీ రెండు శాతం ఓట్లు కూడా సంపాదించలేని పార్టీ అలాంటి హామీ ఇవ్వడం విడ్డూరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ తీరు ఎలా ఉందంటే అమెరికా వెళ్లి తాము ఓబీసీని ప్రెసిడెంట్‌గా చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వీరు అమెరికాలో ప్రెసిడెంట్‌ను కూర్చోబెట్టేది లేదు... తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేది లేదన్నారు. తెలంగాణ ప్రజల వద్ద ఇలాంటి ఉల్టాపల్టా మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. పలు రాష్ట్రాల్లో తామే గెలుస్తామని, కాబట్టి బీజేపీ పంక్చర్ అయిన తమ వాహనాన్ని సరిగ్గా చేసుకోవాలని సూచించారు.

మజ్లిస్ పార్టీ పైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తద్వారా బీజేపీకి సహకరించేందుకే ఎన్నికల బరిలోకి దిగుతుందన్నారు. బీజేపీ ఇచ్చే డబ్బుల కోసం మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ను ఓడించే ఉద్దేశ్యంతో పోటీ చేస్తుందని ఆరోపించారు. బీజేపీ, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. మొదట మనం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కారును ఓడించి ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడిద్దామని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. నమస్కారం... జైహింద్... జైతెలంగాణ అని ప్రసంగం ముగించారు.

More Telugu News