job interview: ఒక్క ఉద్యోగానికి ఇంతమందా.. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు పోటెత్తిన నిరుద్యోగులు..వీడియో ఇదిగో!

  • హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వీడియో
  • ఒకే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వందలాదిగా వచ్చిన అభ్యర్థులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Situation of walk in interviews in Hyderabad

హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే వీడియో ఇది.. కేవలం ఒక్క పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా వందలాదిగా వచ్చిన నిరుద్యోగులతో ఆ ఆఫీసు ప్రాంగణం జాతరను తలపించింది. ఓ అభ్యర్థి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, అర్హులైన అభ్యర్థులు రెజ్యుమేతో వాక్ ఇన్ కు హాజరు కావాలని టైం, డేట్ ప్రకటించింది.

ఉన్నది ఒకటే పోస్టు కావడంతో ఇరవై మందో ముప్పై మందో వస్తారని కంపెనీ యాజమాన్యం భావించగా.. ఏకంగా వందలాది మంది తరలిరావడంతో వారు ఆశ్చర్యపోయారు. వచ్చిన వారందరినీ కంట్రోల్ చేయడానికి ఆ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. జాతరను తలపించేలా కనిపించిన నిరుద్యోగులను చూసి హెచ్ ఆర్ సిబ్బంది కంగుతిన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నిరుద్యోగానికి ఈ వీడియో అద్దం పడుతోందని ఒకరు కామెంట్ చేయగా.. ఐటీ రంగంలో స్వర్ణయుగం ముగిసినట్లేనని మరొకరు అన్నారు. ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, వారందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టమని పలువురు అభిప్రాయపడ్డారు. స్టార్టప్ లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

More Telugu News