Shoaib Malik: అందుకే అతడు రాహుల్ ద్రవిడ్.. గొప్ప విషయాన్ని పంచుకున్న పాక్ బ్యాటర్ షోయబ్ మాలిక్

  • ద్రవిడ్‌లో అహం కొంచెం కూడా ఉండదన్న షోయబ్ మాలిక్
  • తనతో మాట్లాడేందుకు రెండు గంటలు వేచి చూశాడన్న పాక్ మాజీ
  • అతడి కోచింగ్‌లో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రశంస
Shoaib Malik recalls interesting anecdote about Rahul Dravid

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప లక్షణం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సొంతం. అతడి కోచింగ్‌లో ప్రస్తుత భారత జట్టు ప్రపంచకప్‌లో వీరవిహారం చేస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. టీమిండియా అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్నప్పుడు కూడా ద్రవిడ్ అద్భుతాలు సృష్టించాడు. ఎంతోమంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను జాతీయ జట్టుకు అందించాడు. జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉంటూనే జాతీయ జట్టుకు బ్యాకప్ టీంను తయారుచేసిన ముందుచూపున్న మేధావి ద్రవిడ్.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తాజాగా ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడిలో గర్వం ఇసుమంతైనా కనిపించదంటూ ఒకనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ద్రవిడ్ కష్టపడేతత్వం ఇండియన్ క్రికెట్‌ను కొత్త ఎత్తులకు ఎలా తీసుకెళ్లిందీ వివరించాడు. 

పాకిస్థాన్ న్యూస్ చానల్ ‘ఏ స్పోర్ట్స్’తో మాలిక్ మాట్లాడుతూ.. ‘‘అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్నప్పుడు జట్టుతో కలిసి ద్రవిడ్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అదే విమానంలో మేం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. నిద్రపోతున్న నాతో మాట్లాడాలని భావించిన ద్రవిడ్.. నేను నిద్ర లేచే వరకు అంటే దాదాపు 2 గంటలపాటు వేచి చూశాడు. ‘ఉద్వాసనకు గురైన ప్రతిసారీ మళ్లీమళ్లీ జట్టులోకి వస్తున్నావ్.. నిన్ను ప్రేరేపిస్తున్నది ఏమిటి?’ అని అడిగాడు. తాను అండర్-19 జట్టు కోచ్‌గా ఉన్నాను కాబట్టి ఆ రహస్యం ఏదో చెబితే తాను తన కుర్రాళ్లకు చెబుతానన్నాడు’’ అని షోయబ్ గుర్తు చేసుకున్నాడు. 

‘‘దీనిని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే.. ద్రవిడ్‌లో అహం కొంచెం కూడా కనిపించదు. అతడు నిత్యం నేర్చుకోవాలనుకుంటాడు. అతడు తన సొంత కెరియర్‌లోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అందుకే అతడు నన్ను అడగ్గానే చెప్పాను. ఇది నాకు చాలా నచ్చింది. నేర్చుకునే ప్రక్రియకు అంతం ఉండదు. రాహుల్ కోచింగ్‌లో భారత జట్టు ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి’’ అని పేర్కొన్నాడు. 

ప్రపంచకప్‌ జట్టులో ప్రయోగాలు చేస్తుండడంపై ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆ ప్రయోగాలు ఫలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

More Telugu News