Indians Data Leaked: 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో లీక్!

  • భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద సమాచార గోప్యతా వైఫల్యం
  • కొవిడ్ సంక్షోభం సందర్భంగా ఐసీఎమ్ఆర్ సేకరించిన భారతీయుల డేటా బహిర్గతం
  • డార్క్‌ వెబ్‌లో డేటాను బయటపెట్టిన హ్యాకర్
  • డేటా లీక్‌ను తొలిసారిగా గుర్తించిన అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ
  • ఘటనపై దృష్టిసారించిన సీబీఐ
Personal data of eighty one crore Indian users leaked in possibly the largest data breach in Indian history

భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద సమాచార గోప్యతా వైఫల్యం వెలుగుచూసింది. కొవిడ్ సందర్భంగా భారతీయుల నుంచి సేకరించిన కీలక వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు తస్కరించారు. ఈ సమాచారాన్ని ఓ హ్యాకర్ డార్క్ వెబ్‌లో పోస్ట్ చేయడంతో ఈ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) ఈ సమాచారాన్ని సేకరించింది. ఇందులో భారతీయుల పాస్‌పోర్టు, ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్లు, తాత్కాలిక, శాశ్వత అడ్రస్‌లు వంటివి ఉన్నాయి. అయితే, ఈ సమాచారం ఎలా బహిర్గతమైందనే విషయపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదంతా ఐసీఎమ్ఆర్ కొవిడ్ టెస్టింగ్ సందర్భంగా సేకరించిన సమాచారమని హ్యాకర్ చెప్పడం గమనార్హం.

అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సంస్థ రిసెక్యూరిటీ ఈ హ్యాకింగ్ ఉదంతాన్ని తొలుత గుర్తించింది. హ్యాకర్ల చేతికి చిక్కిన సమాచారంలో భారతీయుల వివరాలు ఉన్న లక్ష పైళ్లు ఉన్నట్టు సంస్థ పరిశోధకులు గుర్తించారు. ప్రభుత్వ ఆధార్ వెబ్‌సైట్‌ సాయంతో ఈ సమాచారం నిజమైనదేనని కూడా పరిశోధకులు ధ్రువీకరించుకున్నారు.  ఘటనపై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా కుడా ఐసీఎమ్ఆర్‌ను అప్రమత్తం చేసింది. 

ఈ సమాచారం ఐసీఎమ్ఆర్‌తో పాటూ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద కూడా ఉండటంతో హ్యాకర్లు ఎక్కడి నుంచి ఈ డేటా తస్కరించారనేది తెలుసుకోవడం ఓ సవాలుగా మారింది. 

మరోవైపు, ఈ ఏడాది ప్రథమార్థంలో హ్యకర్లు ఏకంగా ఎయిమ్స్ ఆసుపత్రినే టార్గెట్ చేసుకున్నారు. సర్వర్లను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఎయిమ్స్ నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎయిమ్స్ సిబ్బంది కొన్ని రోజుల పాటు రోగుల రికార్డుల నిర్వహణను మాన్యువల్‌గా చేపట్టాల్సి వచ్చింది.

More Telugu News