Team India: ప్రతి మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో తెలుసా...?

  • టీమిండియా డ్రెస్సింగ్ రూం సంస్కృతిలో మార్పు
  • మ్యాచ్ లో బాగా ఆడిన ఆటగాళ్లకు అభినందనలు
  • ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ కింద ఆటగాడికి మెడల్ బహూకరణ
This what happens in Team India dressing room after every match

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఆటతీరు చూశాక ప్రతి అభిమాని గర్వపడతాడు. ప్రతి మ్యాచ్ లోనూ సాధికారికంగా ఆడి విజయాలు సాధించడాన్ని రోహిత్ సేన ఓ అలవాటుగా మార్చుకుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింట్లోనూ విజయం సాధించింది. అనధికారికంగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.

అయితే, గతంతో పోల్చితే టీమిండియా డ్రెస్సింగ్ రూం సంస్కృతిలో గణనీయంగా మార్పులు వచ్చాయి. ఓ మ్యాచ్ గెలవగానే, ఆ విజయానికి కారకులైన ఆటగాళ్లను, మ్యాచ్ లో అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న ఆటగాళ్లను సత్కరించడాన్ని టీమిండియా మేనేజ్ మెంట్ ఓ విధిగా పెట్టుకుంది. 

ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే... మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు, కోచింగ్ బృందం అంతా డ్రెస్సింగ్ రూంలో చేరతారు. కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు పైకి లేచి, ఆ రోజు ఎవరు బాగా ఆడారో, ఏ అంశంలో వారు ప్రతిభ చూపించారో అందరికీ వివరిస్తారు. అంతేకాదు, రాత్రివేళ మంచులో బౌలింగ్ చేసేందుకు బౌలర్లు ఇబ్బంది పడకుండా, ఫీల్డర్లు బంతిని పొడిగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలను కూడా కోచింగ్ బృందం గమనిస్తుంటుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలను కూడా మేం గమనిస్తుంటాం అని డ్రెస్సింగ్ రూంలో ప్రకటించడం ద్వారా ఆటగాళ్లలో స్ఫూర్తి పెంపొందించే ప్రయత్నం చేస్తుంది. 

మంచి క్యాచ్ పట్టి, మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాడికి మెడల్ బహూకరిస్తారు. నిన్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో విజయం సాధించాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఇలాంటి ఉత్తేజకర వాతావరణమే కనిపించింది. కేఎల్ రాహుల్ కు మెడల్ లభిస్తే, అది తామందరికీ లభించనట్టుగా ఇతర ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేయడం జట్టులోని స్నేహపూర్వక వాతావరణానికి నిదర్శనం. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... టీమిండియా ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గ్రహీతగా కేఎల్ రాహుల్ నిలవగా, స్టేడియంలో లైట్లన్నీ ఆపేసి లేజర్ కిరణాల ద్వారా కేఎల్ రాహుల్ పేరును ప్రదర్శించడం హైలైట్ గా నిలిచింది. ఆ మేరకు నిన్నటి డ్రెస్సింగ్ రూం సెలబ్రేషన్ కు చెందిన వీడియోను బీసీసీఐ పంచుకుంది.

More Telugu News