Ratan Tata: నేను ఏ క్రికెటర్ కూ వంత పాడలేదు: రతన్ టాటా వివరణ

  • రషీద్ ఖాన్ కు రతన్ టాటా రూ.10 కోట్ల బహుమానం అంటూ ప్రచారం
  • తనకు క్రికెట్ తో సంబంధం లేదంటూ రతన్ టాటా ప్రకటన
  • వాట్సాప్ లో వచ్చే వాటిని నమ్మొద్దంటూ సూచన
I have no connection to cricket whatsoever Ratan Tata

తన విషయంలో వస్తున్న వదంతులపై దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ సంస్థల పూర్వ చైర్మన్ రతన్ టాటా వివరణ ఇచ్చారు. దీనంతటికీ వాట్సాప్, సోషల్ మీడియా వేదికలుగా నడుస్తున్న అవాస్తవ ప్రచారమే కారణమని తెలుస్తోంది. వన్డే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై ఆప్ఘనిస్థాన్ చక్కని విజయం సాధించడం గుర్తుండే ఉంటుంది. విజయానందంతో ఆప్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భారత పతాకాన్ని ప్రదర్శించినట్టు, దీనిపై ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. దీంతో రషీద్ ఖాన్ కు రతన్ టాటా రూ.10 కోట్ల బహుమానాన్ని ప్రకటించినట్టు అందులోని సారాంశంగా ఉంది.

దీనిపై స్పష్టతనిస్తూ రతన్ టాటా ట్విట్టర్ లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘‘ఏ క్రికెట్ సభ్యుడికీ జరిమానా విధించమని కానీ, బహుమానం ప్రకటించమని కానీ నేను ఐసీసీకి కానీ, మరే క్రికెట్ సంబంధీకులకు గానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. క్రికెట్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా అధికారిక ప్లాట్ ఫామ్ ల నుంచి వస్తే తప్పించి, దయచేసి వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతున్న సందేశాలు, వీడియోలను నమ్మవద్దు’’ అని రతన్ టాటా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News