Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ ఎక్కడా అనలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy says DK Shivakumar did not say Revanth Reddy will be CM
  • రేవంత్ రెడ్డే సీఎం అంటూ డీకే శివకుమార్ అన్నట్టు కథనాలు
  • శివకుమార్ ప్రసంగాన్ని అనువదించిన రామ్మోహన్ అత్యుత్సాహం చూపాడన్న కోమటిరెడ్డి
  • సీఎం ఎవరన్నది హైకమాండ్ చూసుకుంటుందని వెల్లడి
మునుపటితో పోల్చితే ఈసారి ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో నవ్యోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని కాంగ్రెస్ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్నదానిపైనా ఇప్పటినుంచే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. 

రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని డీకే శివకుమార్ ఎక్కడా అనలేదని, కానీ ఆయన ప్రసంగాన్ని అనువదించిన పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చూపించారని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే ఒక సీఎం అభ్యర్థేనని కోమటిరెడ్డి అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్నది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని వివరించారు. నవంబరు 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గరిష్ఠంగా 80 స్థానాల వరకు వస్తాయని అన్నారు.
Komatireddy Venkat Reddy
Revanth Reddy
Chief Minister
DK Shivakumar
Congress
Assembly Election
Telangana

More Telugu News