janga raghava reddy: ఆరు నియోజకవర్గాల్లో నా అభ్యర్థుల్ని నిలబెడతా: కాంగ్రెస్‌పై జంగా రాఘవరెడ్డి ఆగ్రహం

  • కాంగ్రెస్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే కుట్ర చేశారన్న జంగా రాఘవరెడ్డి
  • పార్టీ కోసం కష్టపడిన తనను కాదని ఇతరులకు టిక్కెట్ ఇచ్చారన్న జంగా
  • నాయిని రాజేందర్ ఒక బ్రోకర్... అసమర్థుడని విమర్శలు
  • పార్టీని, ప్రజలను మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద ప్రమాణం చేద్దామా? అంటూ సవాల్  
Janga Raghavareddy fires at congress party

కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తనకు టిక్కెట్ ఇవ్వలేదని, కానీ కొత్తగా వచ్చిన వారికి ఇచ్చారని జంగా రాఘవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న విడుదలైన జాబితాలో వరంగల్ పశ్చిమ నుంచి తనకు అవకాశం దక్కుతుందని జంగా భావించారు. కానీ ఆయనకు టిక్కెట్ రాలేదు. దీంతో శనివారం ఆయన అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజలు తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వికి టిక్కెట్లు ఇచ్చారని, మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన తనకు ఇవ్వలేదన్నారు. పార్టీ సమావేశాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్నారు. తమ పార్టీ అధిష్ఠానం టిక్కెట్ దక్కించుకున్న నాయిని రాజేందర్ ఒక బ్రోకర్... అసమర్థుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టిక్కెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికీ, నాయకులు ఆ ఓటు వేయించుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. తనపై కుట్ర చేసి, ఇక అసమర్థుడికి టిక్కెట్ ఇచ్చారన్నారు.

తాను పార్టీని, ప్రజలను మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసేందుకు సిద్ధమని, అందుకు నాయిని సిద్ధమా? అని ఆయన సవాల్ చేశారు. కార్యకర్తలతో సమావేశమై, వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆరు నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెడతామని, అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటానన్నారు. వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్‌కు, తనకు మధ్యే పోటీ అన్నారు. ఎల్లుండి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

More Telugu News