KTR: బీజేపీ తమ ఓటమి నెపాన్ని బీసీలపైకి నెట్టడానికే బీసీ ముఖ్యమంత్రిని తెరపైకి తెచ్చింది: కేటీఆర్

KTR comments on Revanth Reddy jail and BJP BC cm
  • కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే రేవంత్ ఇప్పటికే ఊచలు లెక్కపెట్టేవారన్న కేటీఆర్ 
  • బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్న మంత్రి   
  • కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు అందుతున్నాయని వెల్లడి   
తాము పగతీర్చుకోవాలనుకుంటే... కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈపాటికి ఊచలు లెక్కబెట్టేవారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ... బీజేపీ తమ ఓటమి నెపాన్ని బీసీ పైకి నెట్టడానికే బీసీ ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకు వచ్చిందని ఆరోపించారు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు.

ముఖ్యమంత్రి, ప్రధాని అయినంత మాత్రాన తమ సొంత సామాజికవర్గాలకు, నియోజకవర్గాలకు లాభం జరుగుతుందనే అపోహ సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చాయన్నారు. గురుకులాల్లో వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే ఆరోపణ సరికాదన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు అయిదేళ్ల క్రితమే పూర్తయిందని, మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది వచ్చిన వరదలను తట్టుకుందని చెప్పారు. అయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ నివేదిక రానివ్వండి అన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజలపై భారం పడకుండానే సంస్థనే ఈ డ్యాంను బాగు చేస్తుందన్నారు. కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు అందుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే ఒక్క హైదరాబాద్‌లోనే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు.
KTR
BJP
Congress
Revanth Reddy
Telangana Assembly Election

More Telugu News