CSK: ఈ నలుగురికీ చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై?

  • బెన్ స్టోక్స్, అంబటి రాయుడుకు చోటు లేనట్టే
  • మోయిన్ అలీని సైతం విడుదల చేసే అవకాశాలు
  • అతడి నుంచి కనిపించని మెరుగైన ప్రదర్శన
players CSK could release before IPL 2024

ఐపీఎల్ 2024 సీజన్ కు అప్పుడే సన్నాహాలు మొదలవుతున్నాయి. మినీ వేలం వచ్చే డిసెంబర్ లో 19వ తేదీన ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ, డిసెంబర్ లోనే వేలం ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ లోనే ఫ్రాంచైజీలు తాము విడుదల చేసే ఆటగాళ్ల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎవరిని విడుదల చేస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

కెప్టెన్ ఎంఎస్ ధోనీ వయసు మీద పడినా, చెన్నై ఫ్యాన్స్  అభిమానం కోసం అయినా మరో సీజన్ ఆడతానని ప్రకటించాడు. తదుపరి సీఎస్కే కెప్టెన్ ఎవరనే విషయంలో ఇప్పటికీ సందేహం కొనసాగుతోంది. దీంతో ముఖ్యంగా వచ్చే వేలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వేలం ద్వారా భవిష్యత్ కెప్టెన్ ను చెన్నై ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుందా? లేక ఉన్న ఆటగాళ్ల నుంచే ఒకరికి ఈ అవకాశం ఇస్తుందా? అన్నది చూడాలి. కీలకమైన మినీ వేలానికి ముందు సీఎస్కే ఎవరిని విడుదల చేస్తుందనే విషయంలో కొన్ని అంచనాలు ఉన్నాయి. 

అంబటి రాయుడు ఐపీఎల్ 2023 ఫైనల్ కు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. కనుక రాయుడిని సీఎస్కే విడిచి పెట్టినట్టుగానే భావించొచ్చు. పైగా కరీబియన్ లీగ్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లలో ఆడినందున తిరిగి ఐపీఎల్ లో చోటు లభించడం అసాధ్యమే. ఇందుకు బీసీసీఐ నిబంధనలు కూడా అంగీకరించడం లేదు. ముఖ్యంగా సీఎస్కే 16.25 కోట్లు పెట్టి గతేడాది కొనుగోలు చేసిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. గత సీజన్ లో కేవలం రెండు మ్యాచుల్లోనే ఆడిన అతడు, ఎలాంటి ఫలితం చూపించలేదు. గాయం కారణంగా దూరమయ్యాడు. అతడు సర్జరీ కూడా చేయించుకోవాల్సి ఉంది. కనుక స్టోక్స్, సీఎస్కే పరస్పర అంగీకారంతో బంధానికి ముగింపు పలకొచ్చు.

మోయిన్ అలీ  నుంచి ఆల్ రౌండర్ పాత్ర విషయంలో ఆధారపడతగ్గ ప్రదర్శన ఏమీ కొన్ని సీజన్లుగా కనిపించడం లేదు. గత సీజన్ లో కేవలం 124 పరుగులతో 17.71 స్ట్రయిక్ రేట్ చూపించాడు. వికెట్లు తీసింది కూడా లేదు. కనుక అతడ్ని విడిచి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిడిలార్డర్ లో శివమ్ దూబే ఉన్నాడు. అతడు బ్యాట్ తో, బాల్ తోనూ ఫలితాలు చూపించగలడు. కావాలంటే ఆల్ రౌండర్ పాత్ర కోసం మిచెల్ శాంట్నర్ కూడా ఉన్నాడు. కనుక ఈ విడత అయినా అలీకి గుడ్ బై చెబుతుందేమో చూడాలి. డ్వానే ప్రిటోరియస్ ను సైతం సీఎస్కే విడుదల చేసే అవకాశాలే ఉన్నాయి. గత సీజన్ మొత్తం మీద ఒకే మ్యాచ్ లో అవకాశం లభించింది. అతడికి తుది జట్టులో పాత్రపై భరోసా లేకపోవడంతో విడుదల చేసే అవకాశం ఉంది.

More Telugu News