Harbhajan Singh: పాక్ ఓటమికి కారణం చెప్పిన హర్భజన్.. భజ్జీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన సఫారీ మాజీ కెప్టెన్

  • చెత్త అంపైరింగ్ వల్లే పాక్ ఓడిందన్న హర్భజన్
  • టెక్నాలజీ ఆటగాళ్లను కాకుండా అంపైర్‌ను గెలిపిస్తోందంటూ విమర్శలు
  • మరి డుసెన్ అవుట్ సంగతేంటన్న గ్రేమ్ స్మిత్
  • అది కూడా తప్పేనని ఒప్పుకున్న భజ్జీ
Bad Umpiring Cost Pakistan This Game Says Harbhajan Singh

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గెలుపోటములు లెక్కకాదు. చెత్తగా ఆడి టోర్నీ నుంచి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్న సమయంలోనూ అపూర్వంగా తిరిగి పుంజుకుని ఏకంగా టైటిల్‌నే కొట్టేసిన సందర్భాలు కూడా వున్నాయి. తనదైన రోజున పాక్‌ను ఆపడం ఎవరి వల్లా కాదు. ప్రపంచకప్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత గత రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలైంది. దేశాలతో సంబంధం లేకుండా సగటు క్రికెట్ అభిమానిని ఇది తీవ్రంగా బాధపెట్టింది.

ఈ మ్యాచ్‌లో పాక్ ఎందుకు ఓడిందన్న దానిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కారణం చెప్పాడు. పాక్ ఓటమికి బ్యాటింగ్, బౌలింగ్ కారణం కానే కాదని, చెత్త అంపైరింగ్ వల్లే ఓడిందంటూ తీవ్ర విమర్శలు చేశాడు. చెత్త అంపైరింగ్‌కు పాక్ మూల్యం చెల్లించుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ వెంటనే నిబంధనలు మార్చాలని సూచించాడు. బంతి స్టంప్స్‌ను తాకితే అది అవుటేనని, అంపైర్ అవుటిచ్చాడా? లేదా? అన్న దాంతో సంబంధం లేదని పేర్కొన్నాడు. లేదంటే టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తూ ఎక్స్ చేశాడు.

భజ్జీ విమర్శలపై సఫారీ జట్టు మాజీ స్కిప్పర్ గ్రేమ్ స్మిత్ అంతే వేగంగా స్పందించాడు. నువ్వు చెప్పింది సరే కానీ.. మరి తమ బ్యాటర్ డుసెన్ అవుట్ సంగతేంటని ప్రశ్నించాడు. అంపైర్లపై నీ అభిప్రాయమే నాది కూడా అని, మాదీ సేమ్ ఫీలింగ్ అని దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. 19వ ఓవర్లో ఉస్మా మిర్ వేసిన డెలివరీకి ఎల్బీ అయ్యాడు. దీనిపై డుసెన్ రివ్యూకు వెళ్లినా ఫలితం వ్యతిరేకంగా రావడంతో సైలెంట్‌గా మైదానాన్ని వీడాడు. 

దీనికి స్పందించిన హర్భజన్ డుసెన్ నాటౌట్ అని చెప్పుకొచ్చాడు. బ్యాటర్‌ను కాకుండా అంపైర్‌ను రక్షించేందుకు టెక్నాలజీని ఉపయోగించారని పేర్కొన్నాడు. ‘‘నా అభిప్రాయం ప్రకారం అతడు అవుట్ కాదు. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి టెక్నాలజీ కూడా అదే పనిచేసింది. లేదంటే అంపైర్ తప్పుడు నిర్ణయానికి అందరూ అతడిని వేలెత్తి చూపేవారు. సాంకేతికత మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాడిని కాకుండా అంపైర్‌ను రక్షించింది’’ అని తీవ్రస్థాయిలో కామెంట్ చేశాడు.

More Telugu News