Leopard: తిరుమల నడక దారిలో మరో చిరుత ప్రత్యక్షం... భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

  • తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చంపేసిన చిరుత
  • పలు చిరుతలను బంధించిన టీటీడీ
  • చాలారోజుల తర్వాత నడకదారిలో చిరుత కలకలం
  • భక్తులు గుంపులుగా వెళ్లాలన్న టీటీడీ
Another leopard spotted at Tirumala walk way

తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ ఘటన జరిగాక నడకదారి వెంబడి సంచరించే పలు చిరుతలను అటవీశాఖ సహకారంతో టీటీడీ బంధించింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చిరుతల సంచారం లేదు. 

తాజాగా, అలిపిరి నడకమార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి కమ్యూనికేషన్స్ రిపీటర్ స్టేషన్ మధ్య ప్రాంతంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. ట్రాప్ కెమెరాలో ఈ మేరకు రికార్డయింది. ఈ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి కూడా తిరుగుతున్నట్టు కెమెరా ఫుటేజిల్లో వెల్లడైంది. 

ఈ నేపథ్యంలో, టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని స్పష్టం చేసింది. లక్షిత ఘటన జరిగాక, ఘాట్ రోడ్లలో బైకులపై వెళ్లేవారిపై ఆంక్షలు విధించిన టీటీడీ... కొన్ని రోజుల కిందటే ఆ ఆంక్షలు సడలించింది. ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగిన నేపథ్యంలో, మరోసారి ఆంక్షలు విధిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

More Telugu News