Andhra Pradesh: ఏపీలో 4 కోట్లకు పైగా ఓటర్లు.. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ!

  • ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450
  • మహిళా ఓటర్లు 2,03,85,851... పురుష ఓటర్లు 1,98,31,791
Female Voters are more than male voters in AP

2023 ముసాయిదా ఓటర్ల జాబితాను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వీరిలో మహిళా ఓటర్లు 2,03,85,851 మంది కాగా... పురుష ఓటర్లు 1,98,31,791 మంది. వీరిలో సర్వీస్ ఓటర్లు 68,158 ఉన్నారని చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 9వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి జిల్లాలో రాజకీయ పార్టీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

గత ఏడాది జనవరి 6 నుంచి ఈ ఏడాది ఆగస్ట్ 30 వరకు ఓటర్ల జాబితా సంస్కరణను చేపట్టామని చెప్పారు. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన చేశామని... వీటిలో కేవలం 1,533 ఓట్ల తొలగింపులోనే సరైన ప్రక్రియ పాటించినట్టు తేలిందని అన్నారు. జీరో డోర్ నంబర్ తో 2,51,767 ఓట్లు ఉన్నట్టు గుర్తించామని... 1,57,939 ఇళ్లలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టు తేలిందని చెప్పారు.

More Telugu News