Foods: శీతాకాలంలో ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు అవసరం

  • ఈ కాలంలో వేడిని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యం
  • బొప్పాయి పండు మంచి ఆప్షన్
  • క్యారట్, ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోవాలి
  • తులసి, అల్లం రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం
Healthy Foods During Winter

చలి అప్పుడే మొదలైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. శీతాకాలంలో చర్మం పొడిబారి పోవడం సాధారణంగా కనిపిస్తుంది. ఫలితంగా చర్మవ్యాధులు వేధిస్తుంటాయి. శీతాకాలంలో పట్టణాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. నిశ్చల గాలిలో కాలుష్యం ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండడం వల్ల, అది గాలి రూపంలో మన ఊపిరితిత్తులలోకి చేరి పలు సమస్యలకు కారణమవుతుంది. ఈ కాలంలో ఆహారం పరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. 

శీతాకాలంలో తీసుకునే ఆహారం శరీరానికి కొంచెం వేడిని ఇచ్చేదిగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్, నువ్వులను ఈ కాలంలో తినడం వల్ల ఉపయోగాలు ఉంటాయి. జంతు సంబంధిత ఆహారం వేడినిచ్చే జాబితాలోకి వస్తాయి. వీటితోపాటు తృణధాన్యాలు, ప్రొటీన్ తీసుకోవాలి. ముఖ్యంగా క్యారట్, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి, చిలగడదుంప తీసుకోవచ్చు. పాలకూర, మెంతికూర, పుదీనా కూడా మంచి ఫలితాలనిస్తాయి.

  • క్యారట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఏని తయారు చేస్తుంది. ఇంది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
  • తెల్ల ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లిలో ఐసోథియోసైనేట్స్, ఇండోలెస్, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కేన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. 
  • ఆలుగడ్డల ద్వారా మంచి శక్తి లభిస్తుంది.
  • మెంతికూర, పాలకూరలో విటమన్ ఏ, సీ ఉంటాయి. ఈ రెండు మంచి యాంటీ ఆక్సిడెంట్లు. వ్యాధులపై పోరాడే శక్తిని ఇస్తాయి. తోటకూర, కొత్తిమీరను కూడా తీసుకోవచ్చు.
  • బీన్స్, బఠానీ తీసుకోవాలి. వీటి ద్వారా ప్రొటీన్ లభిస్తుంది.
  • ప్రొటీన్ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల చల్లదనంపై పోరాడే శక్తి లభిస్తుంది. ఇందుకోసం బాదం గింజలను తినొచ్చు. మినప సున్నుండలు తీసుకోవచ్చు. 
  • ఇక బొప్పాయి పండు శరీరానికి వేడిని ఇస్తుంది. కనుక ఈ కాలంలో బొప్పాయి మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఉసిరికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఆమ్ల జ్యూస్ లేదా పౌడర్ ను నీటిలో కలిపి రోజూ తీసుకోవాలి.
  • ఖర్జూర చలువ చేస్తుందని అనుకుంటుంటారు. కానీ నిజానికి ఇది వేడిని కలిగిస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ సీ, బీ 3 ఉంటాయి. 
  • ఈ కాలంలో తులసి, అల్లాన్ని రోజువారీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జలుబులపై పోరాడే శక్తి లభిస్తుంది. తులసి, అల్లంతో టీ పెట్టుకుని తాగొచ్చు. 
  • ఇక రోజువారీ వ్యాయామం తప్పకుండా చేయాలి.

More Telugu News