MS Dhoni: నిరుపేదలకు ధోనీ డబ్బులు పంచుతున్నాడని మహిళను నమ్మించి.. పసిపాపను కిడ్నాప్ చేసిన దుండగులు!

Bikers trick woman as the name of Dhoni and kidnap her child in Ranchi
  • ధోనీ సొంతూరు రాంచీలో ఘటన
  • మహిళను నమ్మించి తీసుకెళ్లి చిన్నారితో ఉడాయించిన యువతీయువకులు 
  • మహిళ చెబుతున్న విషయాల్లో పొంతన ఉండడం లేదన్న పోలీసులు
  • అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడి
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పి ఓ మహిళను మాయలో పడేసి ఆమె చిన్నారిని కిడ్నాప్ చేశారు. ధోనీ సొంత పట్టణమైన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పేదలకు ధోనీ డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని బాధిత మహిళను నమ్మించి వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

బాధిత మహిళ మధు దేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి రాంచీలో సామాన్లు కొనుగోలు చేస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఓ యువతి, యువకుడు ఆమెతో మాటలు కలిపారు. పేదలకు ధోనీ సాయం చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని చెప్పి ఆమెను బుట్టలో పడేశారు. వారు చెప్పింది విన్న మధు తనను అక్కడికి తీసుకెళ్లగలరా? అని అడగ్గా అందుకు వారు సరేనన్నారు. మధు 8 ఏళ్ల కుమార్తెను ఓ ఫుడ్‌స్టాల్‌ దగ్గరే ఉంచి, ఆమెతోపాటు ఏడాదిన్నర కుమార్తెను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.  

హర్ములోని ఓ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్దకు మధును తీసుకెళ్లారు. డబ్బుల పంపకానికి సంబంధించి లోపల సమావేశం జరుగుతోందని మధుకు చెప్పి ఆమె దృష్టి మరల్చారు. ఆపై ఆమె ఏడాదిన్నర వయసున్న కుమార్తెను తీసుకుని బైక్‌పై వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. తేరుకున్న మధు వారిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మధు చెబుతున్న విషయాల్లో పొంతన ఉండడం లేదని పోలీసులు చెబుతున్నారు. తొలుత ప్రభుత్వ పథకం అని చెప్పిన ఆమె ఆ తర్వాత ధోనీ పేరు చెప్పిందని పేర్కొన్నారు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్టు చెప్పారు.
MS Dhoni
Jharkhand
Ranchi
Kidnappers

More Telugu News