India: భారత మాజీ నేవి సిబ్బంది 8 మందికి ఖతార్ మరణశిక్ష విధించడంపై స్పందించిన భారత్

Indian govt responds on 8 Navy Veterans Get Death In Qatar
  • కోర్టు తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్య
  • మరణశిక్ష నుంచి తప్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరణ
  • అన్ని దౌత్య, చట్టపరమైన మార్గాల్లో ప్రయత్నిస్తామని వెల్లడి
గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ సిబ్బందికి ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పును ‘షాకింగ్’ పరిణామంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. కోర్టు ప్రొసీడింగ్స్ గోప్యతకు సంబంధించిన అంశం కావడంతో ఈ తీర్పుపై ఇంతకుమించి వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది. 

అయితే తీర్పును వ్యతిరేకించబోతున్నామని హామీ ఇచ్చింది. మరణశిక్ష పడినవారు గతంలో ప్రధాన భారత యుద్ధ నౌకలకు కమాండింగ్ చేశారని భారత్ ప్రస్తావించింది. రిటైర్మెంట్ తర్వాత దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారని, ఖతార్ సాయుధ బలగాలకు శిక్షణ, సంబంధిత సేవలు అందిస్తున్నారని పేర్కొంది. వారిలో కొందరు అత్యంత సున్నితమైన ఇటాలియన్ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములలో పనిచేస్తున్నారని, ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని పేర్కొంది.

తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో మాట్లాడుతున్నామని వెల్లడించింది. మరణశిక్ష నుంచి వారిని తప్పించేందుకు అవకాశమున్న అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని దౌత్య, చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని తెలిపింది.

కాగా మరణశిక్ష పడిన మాజీ నేవి సిబ్బంది ఆగస్టు 2022 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. అయితే దౌత్యపరమైన సాయం కోరేందుకు అవకాశం కల్పించారు. దీంతో వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మార్చిలో విచారణ జరిగింది. పలుమార్లు బెయిల్ అభ్యర్థనలను అక్కడి కోర్టులు కొట్టివేశాయి. వారి జైలును పొడిగిస్తూ వచ్చారు. విచారణ తర్వాత మరణశిక్ష విధిస్తున్నట్టు ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సీడీఆర్ అమిత్ నాగ్‌పాల్, సీడీఆర్ పూర్ణేందు తివారీ, సీడీఆర్ సుగుణాకర్ పాకాల, సీడీఆర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్ మరణశిక్ష పడిన వారిలో ఉన్నారు.
India

More Telugu News