England: ఓటమి నెం.4... శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడిన ఇంగ్లండ్

  • వరల్డ్ కప్ లో నేడు ఇంగ్లండ్, శ్రీలంక ఢీ
  • 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిన ఇంగ్లండ్
  • పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన శ్రీలంక
  • 9వ స్థానానికి పడిపోయిన ఇంగ్లండ్
England registers fourth defeat in ongoing world cup

వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఖాతాలో నాలుగో పరాజయం చేరింది. వరల్డ్ కప్ ముందు వరకు అత్యంత బలంగా కనిపించిన ఇంగ్లండ్ కు మెగా టోర్నీలో ఓటములు అలవాటుగా మారాయి. జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఇవాళ శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 25.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 77, సదీర సమరవిక్రమ 65 పరుగులతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. 

ఓ దశలో శ్రీలంక 23 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా (4), కెప్టెన్ కుశాల్ మెండిస్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ రెండు వికెట్లు డేవిడ్ విల్లీ ఖాతాలో చేరాయి. అయితే, నిస్సాంక, సమరవిక్రమ జోడీ మరో వికెట్ పడకుండా అజేయంగా శ్రీలంకను గెలుపు తీరాలకు చేర్చారు. 

ఈ విజయంతో శ్రీలంక సెమీస్ అవకాశాలను కొద్ది మేర మెరుగుపర్చుకుంది. 5 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అటు, తాజా ఓటమితో ఇంగ్లండ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. 

ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 29న టీమిండియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కథ ముగిసినట్టే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 9వ స్థానంలో ఉంది.

More Telugu News