Snake CPR: నోట్లోకి గాలి ఊది పామును కాపాడిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో!

  • పైపులో దూరిన పామును వెళ్లగొట్టేందుకు పురుగు మందు నీళ్లు పోసిన స్థానికులు
  • ఆ నీళ్లు తాగి కదలిక లేకుండా పడి ఉన్న పాము
  • కానిస్టేబుల్ సీపీఆర్ చేయడంతో పాములో కదలిక
  • మధ్యప్రదేశ్ లో ఘటన.. వీడియో వైరల్
Madhya Pradesh Cop CPR Revive Snake That Drank Pesticide

మనుషులకే కాదు పాములకు కూడా సీపీఆర్ ద్వారా ప్రాణం పోయొచ్చని మధ్యప్రదేశ్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ చెబుతున్నారు. వాటి నోట్లో గాలి ఊదడం ద్వారా చనిపోయాయనుకున్న చాలా పాములను తాను కాపాడానని తెలిపారు. తాజాగా ఓ పాముకు ఆయన సీపీఆర్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పురుగు మందు కలిపిన నీళ్లను తాగి చలనం లేకుండా పడి ఉన్న ఆ పాములో మళ్లీ కదలిక రావడం ఈ వీడియోలో కనిపించింది. అయితే, నిపుణులు మాత్రం సీపీఆర్ ద్వారా పాములు బతకవని, ఈ సంఘటనలో ఆ పాము తనకు తానుగానే మళ్లీ స్పృహలోకి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

నర్మదాపురం పట్టణంలోని ఓ కాలనీలోకి పాము చొరబడింది. ఓ ఇంట్లోని పైప్ లైన్ లో చేరింది. దీనిని బయటకు వెళ్లగొట్టేందుకు ఆ ఇంటివాళ్లు విషం కలిపిన నీళ్లను పైపులోకి జారవిడిచారు. ఆ నీళ్లు తాగిన పాము కాసేపటికి బయటపడింది. అయితే, పాములో చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డిపార్ట్ మెంట్ లో పాములను కాపాడే కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు.

ఆ పాము విషపూరితం కాదని, కొన ఊపిరితో ఉందని గుర్తించి సీపీఆర్ చేశారు. పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊదారు. కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. మరికాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చిన ఆ పామును అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ తెలిపారు. డిస్కవరీ ఛానెల్ చూస్తూ ఈ సీపీఆర్ పద్ధతి గురించి తెలుసుకున్నానని, గత పదిహేనేళ్లలో దాదాపు 500 లకు పైగా పాములను ఇలాగే కాపాడానని వివరించారు.

More Telugu News