Glenn Maxwell: అది నిజంగా దారుణం.. అందుకే కళ్లకు చేతులు అడ్డుపెట్టుకున్నాను: గ్లెన్ మ్యాక్స్‌వెల్

  • అనారోగ్యంతో నెదర్లాండ్‌పై బరిలోకి దిగానని చెప్పిన ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్
  • మ్యాచ్ మధ్యలో కళ్లకు చేతులు అడ్డుపెట్టుకోడానికి అనారోగ్యం కారణం కాదని వివరణ
  • లైట్‌షోతో కళ్లకు ఇబ్బంది కలగకూడదనే ఇలా చేసినట్టు వెల్లడి
Light shows at stadiums great for fans but horrible for players says Glenn Maxwell

నెదర్లాండ్స్‌పై నిన్న చెలరేగిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన శతకంతో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ సమయంలో డ్రింక్స్ బ్రేక్ సందర్భంగా అతడు కళ్లకు చేతులు అడ్డుపెట్టుకోవడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అప్పటికే గ్లెన్ అనారోగ్యంతో ఉన్నాడని తెలిసిన ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. అయితే మ్యాక్స్‌వెల్ ఈ విషయమై తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

తాను అనారోగ్యంతోనే మైదానంలోకి వచ్చినట్టు మ్యాక్స్‌వెల్ చెప్పాడు. అయితే, మ్యాచ్‌కు మధ్యలో కళ్లకు చేతులు అడ్డుపెట్టుకోవడానికి అది కారణం కాదని స్పష్టం చేశాడు. డ్రింక్స్ బ్రేక్‌లో లైట్ షోతో ఇబ్బంది కలగకుండా కళ్లకు చేతులు అడ్డుపెట్టుకోవాల్సి వచ్చిందన్నాడు. 

‘‘అవును..మ్యాచ్‌కు ముందు ఒంట్లో కాస్త ఇబ్బందిగా అనిపించింది. బ్యాటింగ్‌కు వెళ్లాలనే అనిపించలేదు. మునుపటి మ్యాచ్‌లో ఉన్నంత ఉత్సాహం లేకపోయింది. పెద్ద అంచనాలు ఏమీ లేకుండానే మ్యాచ్ ప్రారంభించా’’ అని మ్యాక్స్ వెల్ తెలిపాడు. అంతకుముందు రోజు రాత్రి కుటుంబసభ్యులతో కలిసి గడపడంతో సరిగా నిద్రకూడా పోలేదని చెప్పాడు.  

‘‘లైట్‌ షోలు ప్రేక్షకులకు అద్భుతంగా ఉండొచ్చు కానీ క్రీడాకారులకు మాత్రం చుక్కలు చూపిస్తాయి. పెర్త్ స్టేడియంలో ఓ మారు ఈ లైట్ షో కారణంగా నాకు తలనొప్పి వచ్చింది. లైట్లు పదే పదే వేసి ఆర్పడంతో ఆ తరువాత కళ్లు మామూలు స్థితికి వచ్చేందుకు చాలా టైం పట్టింది. కాబట్టి, లైట్ షో జరిగిన ప్రతిసారీ ఇలా కళ్లను కప్పుకునేందుకు ప్రయత్నిస్తా. ఇవి క్రీడాకారులకు నిజంగా ఇబ్బందే. లైట్ షో ఐడియా నిజంగా దారుణం’’ అని చెప్పాడు.

More Telugu News