South Africa: వాంఖెడేలో దక్షిణాఫ్రికా ఊర మాస్ కొట్టుడు... బంగ్లాదేశ్ ముందు అదిరిపోయే టార్గెట్!

South Africa smashes Bangladesh bowling in Wankehde
  • వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగులు
  • డికాక్ 174, క్లాసెన్ 90, మార్ క్రమ్ 60 పరుగులు
  • చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్
బ్యాటింగ్ కు విశేషంగా సహకరిస్తున్న ముంబయి వాంఖెడే స్టేడియం పిచ్ పై మరోసారి పరుగుల వర్షం కురిసింది. అచ్చొచ్చిన పిచ్ పై దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ మరోసారి చెలరేగిపోయారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ బ్యాట్ తో వీరవిహారం చేయగా, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసక ఇన్నింగ్స్ తో బంగ్లాదేశ్ కు చుక్కలు కనిపించాయి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల అతి భారీ స్కోరు నమోదు చేసింది. డికాక్ భారీ సెంచరీతో మెరిశాడు. 140 బంతుల్లో 174 పరుగులు చేసి బంగ్లాదేశ్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. డికాక్ స్కోరులో 15 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయి.

డికాక్ దూకుడుకే దిక్కుతోచని స్థితిలో పడిన బంగ్లా బౌలర్లు... క్లాసెన్ మాస్ బ్యాటింగ్ కు బెంబెలెత్తిపోయారు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 90 పరుగులు చేసి తన దూకుడును రుచిచూపాడు. ఈ క్రమంలో 2 ఫోర్లు, 8 భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. 

ఆఖర్లో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో చకచకా 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. సఫారీ బ్యాటర్లు ఒకరిని మించి ఒకరు ఉతికారేయడంతో బంగ్లా బౌలర్ల వేదన వర్ణనాతీతం. దక్షిణాఫ్రికన్లు ఆఖరికి కెప్టెన్ షకీబల్ హసన్ ను కూడా వదలకుండా బాదారు. 

బంగ్లా బౌల్లలో హసన్ మహ్మద్ 2, మెహిదీ హసన్ 1, షోరిఫుల్ ఇస్లామ్ 1, కెప్టెన్ షకీబల్ హసన్ 1 వికెట్ తీశారు.
South Africa
Quinton DeKock
Klaasen
Bangladesh
Wankhede
Mumbai
World Cup

More Telugu News