Israel: మరో ఇద్దరు బందీలకు హమాస్ విముక్తి.. కారణం ఏంటంటే..!

  • ఇద్దరు ఇజ్రాయెల్ వృద్ధ మహిళల విడుదల
  • మానవతా దృక్పథంతో విడిచిపెట్టామని హమాస్ ప్రకటన
  • విడుదల కోసం కృషి చేసినట్టు రెడ్‌క్రాస్ వెల్లడి
Hamas releasesd 2 Israeli hostages

గాజా స్ట్రిప్‌లో హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులకు విముక్తి లభించింది. వృద్ధులు కావడంతో మానవతా దృక్పథంలో వారిని విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించింది. వయసు రీత్యా వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని, అయినప్పటికీ శుక్రవారం నాడు వారిని తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ నిరాకరించిందని తన ప్రకటనలో పేర్కొంది.

కాగా.. విముక్తి కల్పించిన బందీల పేర్లు నురిట్ కూపర్ (79), యోచెవెద్ లిఫ్‌షిట్జ్ (85)గా స్థానిక మీడియా వెల్లడించింది. వీరిద్దరిని గాజా సరిహద్దు సమీపంలోని నిర్ ఓజ్‌లోని కిబ్బత్జ్‌లో బందీలుగా పట్టుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో భీకర దాడుల తర్వాత సదరు మహిళలతోపాటు వారి భర్తలను కూడా బందీలుగా చేసుకున్నారు. కానీ వారి భర్తలను మాత్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ఈ పరిణామంపై ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.


కాగా.. బందీల విడుదలకు కృషి చేసినట్టు రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ వెల్లడించింది. వారిద్దరినీ గాజా నుంచి బయటకు తీసుకెళ్లనున్నామని వెల్లడించింది. మధ్యవర్తిగా వ్యవహరించడంతో ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో ఎవరి విడుదలకైనా ప్రయత్నించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

More Telugu News