Jogi Ramesh: చంద్రబాబు, లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి జోగి రమేశ్

  • అవినీతి చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న జోగి రమేశ్
  • చంద్రబాబు చేసింది రాజకీయం కాదు వ్యాపారం అంటూ వ్యాఖ్యలు
  • దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని లోకేశ్ కు, చంద్రబాబుకు సవాల్ 
Jogi Ramesh take a swipe at Lokesh and Chandrababu

ఏపీ మంత్రి జోగి రమేశ్ ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టిన మామను... పిల్లనిచ్చిన మామను... అక్కున చేర్చుకున్న మామను... ఒక్క పోటు పొడిచేసి అధికారం లాక్కోవడంలో సిద్ధహస్తుడు మీ నాన్న అంటూ లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

నాడు రూ.17 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెడితే అందులో చంద్రబాబు ఎంత లేదన్నా రూ.1.70 లక్షల కోట్లయినా కొట్టేసి ఉంటాడని ఆరోపించారు. అవినీతిలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఘనుడు అని, కాకలు తీరిన మేధావి అని జోగి రమేశ్ అభివర్ణించారు. 

"మా నాన్న వ్యాపారం చేస్తే ఇంతకన్నా ఎక్కువే సంపాదించేవాడు అని లోకేశ్ అంటున్నాడు... చంద్రబాబు చేసింది వ్యాపారమే కదా... దీన్ని ఎవరైనా రాజకీయం అంటారా? మీ నాన్న చేసింది ముఖ్యమంత్రిగానా? మీ నాన్న సీఈవోగా చేశాడు... మొత్తం లూటీ చేసి మీ ఆస్తులు కూడబెట్టుకున్నారు. 

లక్షల కోట్ల రూపాయలతో మీ అవినీతి సామ్రాజ్యం విస్తరించుకుని విర్రవీగుతూ... మా నాన్న ఎలాంటి అవినీతి చేయలేదు, నేను ఏమీ చేయలేదు అంటూ చెబుతున్నారు. వీళ్లను చూస్తుంటే ఆవు దూడ సామెత గుర్తొస్తోంది. ఆవు దూడ పొలంలో మేయడానికి వెళితే, పొలం సొంతదారు వాటిని పట్టుకున్నాడట... అప్పుడు ఆవేమో దూడ మీద చెబుతుందట, దూడేమో ఆవు మీద చెబుతుందట... అలా ఉంది వీళ్ల వ్యవహారం! చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకలేడని లోకేశ్ చెబుతాడు... లోకేశ్ నోట్ల వేలు పెడితే కొరకలేడని చంద్రబాబు చెబుతాడు. ఇద్దరూ కూడా తోడు దొంగలు. 

మీటింగ్ పెట్టి వాగుతున్న లోకేశ్ కు చెబుతున్నా, చంద్రబాబుకు కూడా చెబుతున్నా... మీ అవినీతి సామ్రాజ్యం మీద, మీ ఆస్తుల మీద దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి" అంటూ జోగి రమేశ్ డిమాండ్ చేశారు.

More Telugu News