AUS vs PAK: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పవర్ కట్

  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఊహించని ఘటన
  • పాక్ ఇన్నింగ్స్ లో 17, 18వ ఓవర్ల వరకు పనిచేయని డీఆర్ఎస్
  • 19వ ఓవర్ కు తిరిగి అందుబాటులోకి
AUS vs PAK World Cup 2023 Why was the DRS down at Chinnaswamy Stadium

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ పోవడం కారణంగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) రెండు గంటల పాటు పనిచేయకుండా పోయింది. ఆ సమయంలో పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని 17వ ఓవర్ ఆరంభంలోనే మైదానంలో ఉన్న అంపైర్ క్రిస్ బ్రౌన్ ఇరు జట్ల ఆటగాళ్లకు తెలియజేశాడు. అంటే అప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోని అంపైర్ల నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. 


కామెంటేటర్ సైమన్ డౌల్ సైతం దీన్ని ప్రకటిస్తూ, ఆటగాళ్లు కొన్ని ఓవర్ల పాటు టెక్నాలజీపై ఆధారపడలేరని పేర్కొన్నారు. విద్యుత్ పోవడం వల్లే ఇది జరిగినట్టు తెలుస్తోంది. 18వ ఓవర్ ముగిసిన వెంటనే డీఆర్ఎస్ సిస్టమ్ తిరిగి అందుబాటులోకి వచ్చినట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. 

అదృష్టవశాత్తూ 17, 18వ ఓవర్లలో ఎలాంటి వివాదం ఏర్పడలేదు. ఆ సమయంలో అంపైర్ నిర్ణయంపై సందేహం ఏర్పడి ఉంటే, డీఆర్ఎస్ లేకపోవడం వల్ల అది కాస్తా వివాదంగా మారి ఉండేది. ఎందుకంటే ఇప్పటికే వన్డే ప్రపంచకప్ నిర్వహణ విషయంలో భారత్ పై పాకిస్థాన్ పలు విమర్శలు చేసింది. నిన్నటి మ్యాచ్ లో గనుక డీఆర్ఎస్ లేని సమయంలో వివాదం ఏర్పడి ఉంటే అది పెద్ద రచ్చయ్యేది. మరోసారి బీసీసీఐపై ఐసీసీకి పాక్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం లభించి ఉండేది.

More Telugu News