David Warner: పాక్ పై వార్నర్ సూపర్ సెంచరీ... తగ్గేదే లే అంటూ సెలబ్రేషన్

  • వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ వర్సెస్ పాకిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • చిన్నస్వామి స్టేడియంలో వార్నర్, మార్ష్ పరుగుల సునామీ 
  • 85 బంతుల్లో 100 పరుగులు చేసిన వార్నర్
  • మార్ష్ కూడా సెంచరీ అందుకున్న వైనం
Warner celebrates his century like Pushpa

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ పరుగుల సునామీ సృష్టించింది. పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ పోటాపోటీగా సెంచరీలు బాదడంతో ఆసీస్ అతి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

 వార్నర్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా, మార్ష్ 100 బంతుల్లో సెంచరీ సాధించాడు. పిచ్ పై పచ్చిక చూసి బౌలింగ్ కు అనుకూలిస్తుందని భావించిన పాక్ సారథి బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై ఉన్న పచ్చిక బౌన్స్ కు ఉపయోగపడిందే తప్ప స్వింగ్  లేకపోవడంతో పాక్ బౌలర్లు తేలిపోయారు. 

షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ వంటి సీనియర్ బౌలర్లు కూడా బెంగళూరు పిచ్ పై సాధారణ బౌలర్లుగా కనిపించారు. వార్నర్, మార్ష్ పోటీలు పడి మరీ పాక్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. ఆరంభంలో వార్నర్ ఇచ్చిన తేలికైన క్యాచ్ ను ఉసామా మిర్ జారవిడవడం ఎంత పెద్ద తప్పిదమో మ్యాచ్ సాగే కొద్దీ తెలిసి వచ్చింది. వార్నర్ సిక్సర్ల మోత మోగించాడు. సెంచరీ పూర్తవగానే 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద చేయిపోనిచ్చి పుష్ప స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే మార్ష్ సెంచరీ కూడా పూర్తవడం విశేషం. 

ప్రస్తుతం ఆసీస్ స్కోరు 33.5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 259 పరుగులు. వార్నర్ 124 పరుగులతో ఆడుతున్నాడు. మార్ష్ 121 పరుగులు చేసి షహీన్ అఫ్రిది బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ సున్నాకే వెనుదిరిగాడు. 


More Telugu News