Virat Kohli: బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు జట్టు సభ్యులకు కోహ్లీ వార్నింగ్.. సమర్థించిన పాండ్యా!

  • ప్రపంచ కప్ లో చిన్న జట్లు అంటూ ఉండవన్న కోహ్లీ
  • కేవలం పెద్ద జట్ల పైనే దృష్టి సారిస్తే నిరాశ తప్పదని హెచ్చరిక
  • షకీబ్ అల్ హసన్ గొప్ప ప్లేయర్ అని కితాబు
Kohli warning to team members before match with Bangladesh

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో పసికూనలైన ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు సంచలనాలు సృష్టించాయి. గత ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో పటిష్ఠమైన ఇంగ్లండ్ టీమ్ ను ఆఫ్ఘన్ జట్టు 69 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మరోవైపు బుధవారం నాడు ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు పూణేలో బంగ్లాదేశ్ తో టీమిండియా మ్యాచ్ జరగనున్న తరుణంలో జట్టు సభ్యులకు విరాట్ కోహ్లీ కీలక హెచ్చరికలు చేశాడు. 

ప్రపంచ కప్ లో చిన్న జట్లు అంటూ ఉండవని కోహ్లీ చెప్పాడు. కేవలం బలమైన జట్లపైనే దృష్టిని సారిస్తే... నిరాశ తప్పదని హెచ్చరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గురించి మాట్లాడుతూ... కొన్నేళ్లుగా షకీబ్ కు పోటీగా తాను చాలా క్రికెట్ ఆడానని... అతనికి ఆటపై ఎంతో నియంత్రణ ఉందని చెప్పాడు. అంతేకాదు, షకీబ్ ఎంతో ఎక్సీ పీరియన్స్ ఉన్న బౌలర్ కూడా అని తెలిపాడు. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని... బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించడంలో దిట్ట అని చెప్పాడు. ఇలాంటి బౌలర్లను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి నైపుణ్యంతో ఆడాలని సూచించాడు. వీరిని సమర్థంగా ఎదుర్కోలేకపోతే... ఒత్తిడి పెరుగుతుందని, ఔట్ అయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరించాడు. 

కోహ్లీ వ్యాఖ్యలను హార్దిక్ పాండ్యా సమర్థించాడు. షకీబ్ ఒక స్మార్ట్ క్రికెటర్ అని కితాబునిచ్చాడు. బంగ్లాదేశ్ జట్టును కొన్నేళ్లుగా తన భుజాలపై మోస్తున్నాడని చెప్పాడు. మరోవైపు కోహ్లీపై షకీబ్ ప్రశంసలు కురిపించాడు. అధునాతన క్రికెట్ యుగంలో కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మెన్ అని ప్రశంసించాడు. కోహ్లీని 5 సార్లు ఔట్ చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. విరాట్ వికెట్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే అని అన్నాడు.

More Telugu News