Atchannaidu: చంద్రబాబును అక్రమ కేసులతో వేధిస్తున్నారు: గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

TDP leaders complaint agains ycp government over chandrababu arrest
  • ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నాయకుడిని ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారన్న అచ్చెన్న
  • గవర్నర్ సానుకూలంగా స్పందించారన్న టీడీపీ నేతలు
  • ఈ నాలుగేళ్ళ కాలంలో సీఐడీ టీడీపీ నేతలపైనే కేసు పెట్టిందని విమర్శ 
తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులతో వేధిస్తున్నారని టీడీపీ నేతలు... ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్‌లో అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఎనిమిది మంది టీడీపీ నేతలు ఆయనను కలిశారు. రాష్ట్రంలో పరిణామాలు, చంద్రబాబు అరెస్టుపై గవర్నర్‌కు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ప్రజల సమస్యలపై పోరాటం చేసిన నాయకుడిని ఓ ఉగ్రవాదిలాగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు? ఆధారాలు ఉన్నాయా? అని అడిగితే అరెస్ట్ చేసి, విచారించాక ఆధారాలు చూపిస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఏమాత్రం అవినీతి చేయలేదన్నారు. స్కిల్ కేసులో ఓ కంపెనీ ఎనిమిదిన్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టలేదు కాబట్టి కేసు పెట్టినట్లు కేంద్రం చెప్పిందన్నారు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్... మూడు కేసులు పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రం దశ దిశను మార్చాయన్నారు. కానీ వీటిలో అవినీతి జరిగిందని అరెస్ట్ చేశారన్నారు.

గవర్నర్‌కు అన్ని వివరాలు వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కేసు గురించి తనకు పూర్తిగా తెలుసునని, కానీ కోర్టు పరిధిలో ఉందని, ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారని, ఇంతకుమించి ఈ కేసు గురించి తాను మాట్లాడలేనని గవర్నర్ చెప్పారన్నారు. ఆయనకు అన్ని వివరాలు తెలుసునని, అయినప్పటికీ వాస్తవాలు వివరించామన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశారో వివరించామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో సీఐడీ... టీడీపీ నేతల పైనే కేసులు పెట్టిందన్నారు. అలాగే మార్గదర్శిపై పెట్టిందన్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేయడం మినహా ఏం చేయడం లేదన్నారు. అవినీతి జరిగిందని, తప్పులు చేశారని నిరూపించలేకపోయారన్నారు.
Atchannaidu
Telugudesam
Governor

More Telugu News