central govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపును ప్రకటించిన కేంద్రం

  • 4 శాతం డీఏ పెంపునకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం
  • 42 శాతం నుంచి 46 శాాతానికి చేరిక
  • నవంబర్ నెల వేతనాలతో పాటు చెల్లింపులు
4 percent DA hike approved for government employees

ముఖ్యమైన పండుగల ముందు ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు డీర్ నెస్ అలవెన్స్ (కరవు భత్యం/డీఏ)ను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు డీర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ను 4 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 


కేంద్రం తాజా నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి చేరనుంది. తాజాగా ఆమోదించిన డీఏ 2023 జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. నిజానికి మూడు నెలలకు పైగా డీఏ పెంపు అపరిష్కృతంగా ఉంది. కీలకమైన పండుగల ముందు దీనిపై నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ఊరట కల్పించినట్టయింది. ప్రభుత్వ నిర్ణయంతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. 

నవంబర్ నెల వేతనాలతో కలిపి పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి రానుంది. జులై నుంచి అక్టోబర్ వరకు బకాయిలు కూడా చెల్లించనున్నారు. బేసిక్ వేతనం రూ.18,000 వేతనం ఉన్న వారికి 42 శాతం డీఏ కింద రూ.7,560 వస్తుంది. దీన్ని 46 శాతానికి పెంచడంతో ఇకపై రూ.8,280 రానుంది. మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ప్రతీ ఆరు నెలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీఏని ప్రకటిస్తుంటాయి.

More Telugu News