Pendurthi: న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన మహిళ.. ఏపీలోని పెందుర్తిలో ఘటన

  • అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ కొనుగోలుపై వివాదం
  • రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని చెబుతున్న మహిళ
  • ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు ఖాళీ చేయట్లేదంటున్న యజమాని
  • పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ.. ఈ గొడవతో స్పృహ కోల్పోయిన సీఐ
Woman Locked Police Station For This Cause In Pendurthi

అపార్ట్ మెంట్ కొనుగోలుకు అడ్వాన్స్ తీసుకుని, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని గొడవ చేస్తున్నాడంటూ ఇంటి యజమానిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తనకు న్యాయం చేయాలంటూ రోజూ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. అయినా ఫలితం లేకుండా పోయిందని విసుగుచెంది ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. 

ఏపీలోని పెందుర్తి శ్రీకృష్ణరాయపురంలో తెరపల్లి గౌతమి పార్వతి అనే మహిళ ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటోంది. భర్తతో విడిపోయిన గౌతమి.. కొడుకు, కూతురుతో కలిసి ఆరేళ్లుగా అదే అపార్ట్ మెంట్ లో ఉంటోంది. అయితే, ఈ అపార్ట్ మెంట్ ను అమ్మేస్తానని, ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ బి.పీర్లు చెప్పారు. దీంతో అపార్ట్ మెంట్ ను తానే కొనుగోలు చేస్తానని చెప్పిన గౌతమి.. పీర్లుతో రూ.12.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది.

అడ్వాన్స్ గా రూ.5 లక్షలు కూడా ఇచ్చినట్లు తెలిపింది. కొంతకాలంగా ఇల్లు ఖాళీ చేయాలంటూ పీర్లు వేధింపులకు గురిచేస్తున్నాడని, అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తం తిరిగిస్తే ఖాళీ చేస్తానని చెప్పినా వినిపించుకోవడంలేదని ఆరోపించింది. ఇటీవల తాను లేని సమయంలో ఇంటికి వచ్చి సామాన్లు అన్నీ బయటపడేశారని, ఫ్లాట్ కు తాళం వేసుకుని వెళ్లాడని చెప్పింది. దీంతో మరోదారిలేక పిల్లలతో కలిసి వరండాలోనే ఉంటున్నానని వివరించింది. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తన బాధ పోలీసులకూ అర్థం కావాలనే ఉద్దేశంతో స్టేషన్ కు మంగళవారం రాత్రి తాళం వేసినట్లు తెలిపింది.

ఫ్లాట్ ఓనర్ ఏమంటున్నారంటే..
గౌతమి తన ఫ్లాట్ లో చాలాకాలంగా అద్దెకు ఉంటోందని యజమాని పీర్లు చెప్పారు. ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా చేయట్లేదని, తప్పుడు పత్రాలతో బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించాడు. తమ ఫ్లాట్ ను లాక్కోవడానికి గౌతమి ప్రయత్నిస్తోందని వివరించారు. తప్పుడు ఫిర్యాదుతో తమను వేధిస్తోందని పీర్లు తెలిపారు. కాగా, పీర్లు, గౌతమిల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సీఐ శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి కిందపడిపోవడంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

More Telugu News