Nederlands: వరల్డ్ కప్ లో మరో సంచలనం... సఫారీలను కుమ్మేసిన ఆరెంజ్ ఆర్మీ

Nederlands sensational win over South Africa
  • ధర్మశాలలో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్
  • వర్షం వల్ల మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు
  • మొదట 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసిన డచ్ జట్టు
  • ఛేదనలో 42.5  ఓవర్లలో 207 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

వరల్డ్ కప్ లో ఇటీవల డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్థాన్ చిత్తుగా ఓడించిన సంగతి మరువకముందే మరో సంచలనం నమోదైంది. ఇవాళ ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఆరెంజ్ ఆర్మీగా పేరుగాంచిన నెదర్లాండ్స్ జట్టు 38 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 

43 ఓవర్లలో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సఫారీలు చతికిలబడ్డారు. 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయ్యారు. డచ్ బౌలర్లు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికా పనిబట్టారు. వాన్ బీక్ 3, వాన్ మీకెరెన్ 2, వాన్ డెర్ మెర్వ్ 2, బాస్ డీ లీడ్ 2, అకెర్ మన్ 1 వికెట్ తీశారు. 

దక్షిణాఫ్రికా జట్టులో డికాక్, మార్ క్రమ్, మిల్లర్, బవుమా, డుస్సెన్, క్లాసెన్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ ఇవాళ ఆరెంజ్ ఆర్మీ ముందు తలవంచారు. వరల్డ్ కప్ లో గత రెండు మ్యాచ్ ల్లో సాధికారికంగా నెగ్గిన సఫారీలు... ఇవాళ  నెదర్లాండ్స్ ను ఓ ఆట ఆడుకుంటారని అందరూ భావించారు. కానీ... ఇది క్రికెట్! ఏమైనా జరగొచ్చు అని నిరూపిస్తూ... సఫారీలను డచ్ సేన కుమ్మేసింది. మిల్లర్ 43, క్లాసెన్ 28, కోట్జీ 22, డికాక్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సఫారీలకు పరాభవం తప్పలేదు. చివర్లో కేశవ్ మహరాజ్ పోరాడినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 40 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 43కి కుదించారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News