Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగిస్తున్న ముకుల్ రోహాత్గీ

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత
  • వాదనలు వింటున్న అత్యున్నత న్యాయస్థానం
Mukul Rohatgi continue arguments in Supreme Court on Chandrababu quash petition

స్కిల్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదని రోహాత్గీ సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ ను వర్తింపజేయలేరని వివరించారు. 

17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫారసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకువచ్చారని, అలాగని 17ఏ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ చత్రం కాకూడదని రోహాత్గీ పేర్కొన్నారు. 

ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని తెలిపారు. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని వివరించారు. న్యాయ పరిధికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని, ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందని ముకుల్ రోహాత్గీ సుప్రీం ధర్మాసనానికి  తెలియజేశారు.

వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సీఆర్పీసీ 482 సెక్షన్ కింద క్వాష్ చేయలేము అని స్పష్టం చేశారు. అందుకు జస్టిస్ బేలా త్రివేది స్పందించారు. ఆరోపణలు ఉన్నప్పుడు చార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష వేయవచ్చు... అంతేకానీ, కేవలం ఆరోపణలతోనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా? అని ప్రశ్నించారు. దాంతో, ముకుల్ రోహాత్గీ... ఈ అంశం అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణనలోకి తీసుకోండి... లేదంటే క్వాష్ చేయండి అని విన్నవించారు. 

ఈ క్రమంలో ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పందిస్తూ... ఇప్పుడు మనం మాట్లాడుతోంది ఈ కేసుకు 17ఏ వర్తిస్తుందా... లేదా? అనేదే కదా అని సూటిగా ప్రశ్నించారు. కేసుల నమోదు, చార్జిషీట్లు వేయడం, విచారణ అన్నీ కేసుల్లోనూ జరిగేవే కదా అని వ్యాఖ్యానించారు. 

అందుకు, ముకుల్ రోహాత్గీ బదులిస్తూ... అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుందని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు కూడా ఉన్నాయని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. జీఎస్టీ, ఆదాయపన్ను శాఖతో పాటు మరికొన్ని విభాగాలు  కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని రోహాత్గీ తెలిపారు. 

నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా... అంతవరకే పరిమితం కావాలి అని అత్యున్నత న్యాయస్థానాన్ని ఒప్పించేందుకు యత్నించారు. ఏసీబీ కేసు అయినా, సాధారణ కేసు అయినా అదే పోలీసులు విచారణ చేస్తారని తెలిపారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారని రోహాత్గీ ప్రశ్నించారు.

More Telugu News