Israel: రియా, నిషా... ఇజ్రాయెల్ సైన్యంలో గుజరాతీ అమ్మాయిలు

  • చాన్నాళ్ల కిందట గుజరాత్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లిన జీవాభాయ్, సవ్దాస్ భాయ్
  • అక్కడే స్థిరపడి కిరాణా దుకాణాలతో ఉపాధి
  • వీరి కుటుంబాలకు చెందిన రియా, నిషా సైన్యంలో సేవలందిస్తున్న వైనం
  • ఇజ్రాయెల్ లో 18 ఏళ్లకు పైబడిన వారు సైన్యంలో పనిచేయడం తప్పనిసరి
Gujarathi women in Israel army

ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ ఇజ్రాయెల్ పై ఒక్కసారిగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వాయు, భూతల, జల మార్గాల్లో ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు భీకరదాడులు చేసి వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారు. 

ఇప్పుడా నరహంతక హమాస్ ను సమూలంగా నిర్మూలించాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. అందుకోసం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ సైనికులను ఇజ్రాయెల్ ఒక్కచోటికి చేర్చుతోంది. దాదాపు 3 లక్షల మంది సైనికులతో గాజాలో అణువణువును ముట్టడించి హమాస్ ముష్కరులను ఏరిపారేయాలన్నది ఇజ్రాయెల్ ప్రణాళిక! 

ఈ క్రమంలో, హమాస్ పై దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ బలగాల్లో ఇద్దరు భారత సంతతి అమ్మాయిలు కూడా ఉన్నారు. వారి పేరు రియా ములియాసియా, నిషా ములియాసియా. వీరిద్దరి మూలాలు గుజరాత్ లో ఉన్నాయి. 

ఎన్నో ఏళ్ల కిందట జీవాభాయ్ ములియాసియా, సవ్దాస్ భాయ్ ములియాసియా అనే ఇద్దరు వ్యక్తులు గుజరాత్ నుంచి వలస వచ్చి ఇజ్రాయెల్ లో స్థిరపడ్డారు. గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలోని కొఠాడి గ్రామం వారి స్వస్థలం. ఇజ్రాయెల్ వచ్చిన జివాభాయ్, సవ్దాస్ భాయ్ తమ కుటుంబాలతో ఇజ్రాయెల్ లో స్థిరనివాసం ఏర్పరచుకుని కిరాణా దుకాణాలు తెరిచారు. వారు ఇజ్రాయెల్ పౌరసత్వం కూడా పొందారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయిలే రియా, నిషా. 

ఇజ్రాయెల్ లో ప్రతి ఒక్కరూ రెండేళ్ల నుంచి మూడేళ్ల పాటు సైనిక సేవలు అందించాల్సిందే. పురుషులు, మహిళలు అని తేడా లేకుండా 18 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరడం ఇజ్రాయెల్ లో తప్పనిసరి. అయితే దివ్యాంగులకు, మానసిక వైకల్యాలతో బాధపడేవారికి, కళాకారులకు, క్రీడాకారులకు ఇందులో మినహాయింపు ఉంటుంది. మినహాయింపు ప్రకారం పురుషులు 8 నెలలు, మహిళలు 2 నెలలు పనిచేస్తే సరిపోతుంది. 

ఇక, తప్పనిసరి సైనిక విధానంలో భాగంగానే రియా, నిషా తుపాకీలు చేతబట్టారు. ప్రస్తుతం కమాండో శిక్షణలో ఉన్న రియా కూడా హమాస్ పై పోరుకు సై అంటోంది. నిషా కమ్యూనికేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో సేవలందిస్తోంది. ఓ పదాతి దళానికి ఆమె ఇన్చార్జి కూడా. ఇజ్రాయెల్ కు ఉగ్రవాదుల పీడ విరగడ చేయడానికి తమ వంతు పోరాడతామని రియా, నిషా దృఢసంకల్పంతో చెబుతున్నారు.

More Telugu News