Cricket: ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడంపై ఓటింగ్... అనుకూలంగా మెజారిటీ సభ్యుల ఓట్లు

  • ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
  • ఇవాళ ముంబయిలో ఐఓసీ సమావేశం
  •  క్రికెట్ సహా ఐదు క్రీడలకు ఒలింపిక్స్ ఎంట్రీపై ఓటింగ్
  • ఇద్దరు సభ్యులు మినహా మిగతా వారంతా అనుకూలంగా ఓటింగ్
Cricket entry in Olympics garners votes in favour

ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడ ఎంట్రీకి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. ఇవాళ ముంబయిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్, స్క్వాష్, బేస్ బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్ బాల్ క్రీడలకు ప్రవేశం కల్పించడంపై ఓటింగ్ నిర్వహించారు. 

ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ సభ్యులంతా ఈ ఐదు క్రీడాంశాలకు ఒలింపిక్స్ లో స్థానం కల్పించడానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో, ఈ ఐదు క్రీడలకు ఒలింపిక్స్ లో చోటు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించే ప్రక్రియ పూర్తయిందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. 

ఇక, ఈ ఐదు క్రీడలు 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో నిర్వహించే ఒలింపిక్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. 

కాగా, 1900లో తొలిసారిగా ఒలింపిక్స్ లో క్రికెట్ ఈవెంట్ నిర్వహించారు. అయితే, నాడు కేవలం బ్రిటన్, ఫ్రాన్స్ కు చెందిన రెండు క్లబ్ ల మధ్య ఒకే ఒక్క పోటీ నిర్వహించారు. అందులో బ్రిటన్ క్లబ్ గెలిచింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత లాస్ ఏంజెల్స్ గేమ్స్ ద్వారా క్రికెట్ ఒలింపిక్స్ గడప తొక్కనుంది. 

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న ప్రతిపాదనకు ఐఓసీ కార్యనిర్వాహక బోర్డు ఇటీవలే ఆమోదం తెలిపింది. దానిపైనే ఇవాళ ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఒలింపిక్స్ లో టీ20 ఫార్మాట్లోనే క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు.

More Telugu News