Israel-Hamas War: నెతన్యాహు ఓ దుష్టశక్తి.. యుద్ధ నేరగాడు.. తీవ్రస్థాయిలో మండిపడిన అసదుద్దీన్

  • తాను పాలస్తీనా వైపే ఉంటానన్న ఎంఐఎం చీఫ్
  • యోగి ఆదిత్యనాథ్‌ను బాబా ముఖ్యమంత్రిగా అభివర్ణించిన ఒవైసీ
  • పాలస్తీనియన్లపై అకృత్యాలు ఆపేలా చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి
  • కాల్పుల విరమణ పాటించాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
Asaduddin Owaisi calls Israel PM a devil

హమాస్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దానిని సర్వనాశనం చేస్తామని, ఒక్క హమాస్ ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతినబూనారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ యుద్ధంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో స్పందించారు.

హైదరాబాద్‌ నిన్న జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఒవైసీ మాట్లాడుతూ.. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాదిమంది శాల్యూట్ చేస్తున్నారని అన్నారు. నెతన్యాహును దుష్టశక్తిగా అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ధ నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని ఓ బాబా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారని పరోక్షంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మన త్రివర్ణ పతాకంతోపాటు తాను పాలస్తీనా జెండాను కూడా గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. తాను పాలస్తీన్ పక్షానే ఉంటానని అసద్ తేల్చి చెప్పారు.  

పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని పేర్కొన్నారు. కాగా, ఇరు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది.

More Telugu News