Team India: కీలక వికెట్ తీసి బ్రేక్ ఇచ్చిన సిరాజ్... తిప్పేసిన కుల్దీప్.. పాక్ విలవిల

  • వరల్డ్ కప్ లో నేడు దాయాదుల మహా యుద్ధం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 34 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసిన పాక్
  • అర్ధసెంచరీ సాధించిన బాబర్ ను బౌల్డ్ చేసిన సిరాజ్
Team India scalps Pakistan top order

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ సమరం ఆసక్తికరంగా జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట్లో భారత బౌలర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు. మిడిల్ ఓవర్ల వరకు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ పెద్దగా ఇబ్బంది పడకుండానే స్కోరుబోర్డును నడిపించారు. 

ఇన్నింగ్స్ ఎలా సాగిందంటే... సిరాజ్... పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ను అవుట్ చేసి తొలి వికెట్ పడగొట్టాడు. షఫీక్ 24 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేసి రెండో  వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ వికెట్ హార్దిక్ పాండ్యాకు దక్కింది. అప్పటికి జట్టు స్కోరు 12.3 ఓవర్లలో 73 పరుగులు. 

అక్కడ్నించి కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ జోడీ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది. అయితే, మరోసారి సిరాజ్ కీలక వికెట్ తీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. సరిగ్గా 50 పరుగులు  చేసి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న బాబర్ అజామ్ ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ విసిరిన బంతిని కట్ చేయబోయిన బాబర్ ఆ ప్రయత్నంలో విఫలమై అవుటయ్యాడు. 

అక్కడ్నించి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిప్పేశాడు. మొదట సాద్ షకీల్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత హార్డ్ హిట్టర్ ఇఫ్తికార్ అహ్మద్ ను బౌల్డ్ చేశాడు. దాంతో పాక్ శిబిరంలో నిశ్శబ్దం అలముకుంది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే 5 వికెట్లు పడిపోయాయి. అది చాలదన్నట్టుట.. సెకండ్ స్పెల్ లో బంతిని అందుకున్న బుమ్రా... అప్పటికే క్రీజులో కుదురుకున్న మహ్మద్ రిజ్వాన్ (49) ను బౌల్డ్ చేయడంతో పాక్ ఆరో వికెట్ కోల్పోయింది.

ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు 34 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు కాగా... క్రీజులో  నవాజ్ ( 0 బ్యాటింగ్), షాదాబ్ ఖాన్ (1 బ్యాటింగ్) ఉన్నారు.

More Telugu News