Chandrababu: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ కు వివరించేందుకు టీడీపీ నేతల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Police halts TDP leaders who rallied to CM Jagan residence
  • రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • చంద్రబాబు ఆరోగ్యం పట్ల టీడీపీ నేతల తీవ్ర ఆందోళన
  • చంద్రబాబును ఎయిమ్స్ కు తరలించాలని డిమాండ్
  • తాడేపల్లిలోని  సీఎం నివాసానికి బయల్దేరిన టీడీపీ నేతలు
  • బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజమండ్రి జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ టీడీపీ నేతలు సీఎం జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యరావు తదితర టీడీపీ నేతలు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీఎం నివాసానికి బయల్దేరారు. 

అయితే పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. బుద్ధా, పిల్లి మాణిక్యరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్యుద్ధం నెలకొంది. 

అంతకుముందు, పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు సమావేశమై చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. చంద్రబాబు ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గడం ఆరోగ్యపరంగా ఏమంత మంచి పరిణామం కాదని, అది ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎంకు వివరించేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, వర్ల రామయ్య, బొండా ఉమ, బుద్ధా వెంకన్న, కళా వెంకట్రావు, దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ కు చంద్రబాబును తరలించాలని వారు డిమాండ్ చేశారు. జైల్లో ఉన్న చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్య బృందాన్ని పంపాలని అన్నారు.
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News