Varla Ramaiah: సజ్జల విసిరిన చాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నా: వర్ల రామయ్య

  • చంద్రబాబు అవినీతి నిరూపిస్తామంటూ సజ్జల చాలెంజ్
  • బహిరంగ చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలని సజ్జలను ప్రశ్నించిన వర్ల
  • జగన్ దోషిగా తేలితే జీవితకాలం జైల్లోనే ఉండాలని వ్యాఖ్యలు
Varla Ramaiah says he accepted Sajjala challenge

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వైసీపీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని నిరూపిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని వర్ల రామయ్య ప్రకటించారు. 

"బహిరంగ చర్చ ఎప్పుడన్నది సజ్జల ప్రకటించాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నేను ఆ డిబేట్ కు వస్తా... స్కిల్ కేసులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నిరూపిస్తా" అని స్పష్టం చేశారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ సయయంలో తాను లండన్ లో ఉన్నానని, ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని సీఎం జగన్ చెప్పడంపైనా వర్ల మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ చెప్పిన మాటలు అబద్ధం... ఆ రోజు లండన్ నుంచి సజ్జల, రఘురామిరెడ్డి (డీఐజీ), సంజయ్ (సీఐడీ చీఫ్)లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం నిజం కాదా? అని నిలదీశారు. 

అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ దోషిగా తేలితే జీవితమంతా జైల్లోనే గడపాల్సి ఉంటుందని, తాము అధికారంలోకి వస్తే చంద్రబాబును ఉంచిన బ్యారక్ లోనే జగన్ ను ఉంచుతామని, అవినీతిపరులను వదలబోమని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని, మరి జగన్ రూ.43 వేల కోట్ల దోపిడీకి సహకరించిన వైఎస్ కు ఎంతకాలం శిక్ష పడాలి? అని ప్రశ్నించారు.

More Telugu News