cough syrup: మాయదారి దగ్గు ముందు కంపెనీకి మళ్లీ అనుమతులు

  • మారియన్ బయోటెక్ లో తయారీకి యూపీ అనుమతి
  • దగ్గు ముందు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీకీ ఆమోదం
  • ఈ కంపెనీ దగ్గు మందు తాగి ఉజ్బెకిస్థాన్ లో 65 మంది చిన్నారుల మరణం
India allows cough syrup firm linked to Uzbek deaths to reopen factory

ఉజ్బెకిస్థాన్ లో 65 మంది చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమైన భారత ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్ ఉదంతం గుర్తుండే ఉంటుంది. మారియన్ తయారు చేసిన దగ్గు మందులో హానికారకాలు అధిక పరిమాణంలో ఉన్నట్టు, వీటి కారణంగానే చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఉజ్బెకిస్థాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గతేడాది ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామం తర్వాత మారియన్ బయోటెక్ ప్లాంట్ లో తయారీ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ యూపీ సర్కారు ఆదేశించింది. 


ఈ ఏడాది మార్చి నుంచి మారియన్ బయోటెక్ యూపీ ప్లాంట్ మూతపడి ఉంది. డైఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ ఆమోదనీయం కాని స్థాయుల్లో ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఈ ఇంగ్రేడియంట్స్ ను సాధారణంగా మనుషులకు సంబంధించి ఔషధాల్లో వినియోగించరు. మారియన్ తయారు చేసిన సిరప్ లో కల్తీ ఉన్నట్టు భారత ప్రభుత్వ లేబరేటరీ పరీక్షల్లోనూ తేలినట్టు యూపీ డ్రగ్ కంట్రోలర్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. మరి ఇంతలో ఏమైందో తిరిగి అనుమతులు మంజూరు అయ్యాయి.

మారియన్ తయారు చేసే ఇతర ఔషధాల్లో నాణ్యత లేదంటూ ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదని.. దీంతో మారియన్ అప్పీల్ ను పాక్షికంగా ఆమోదిస్తున్నట్టు డ్రగ్ కంట్రోలర్ తెలిపారు. ప్రాపీలేన్ గ్లైకాల్ తో తయారీని నిషేధించినట్టు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విక్రయించుకోవచ్చని చెప్పినట్టు సమాచారం. మరోసారి ఇలాంటి పరిణామం చోటు చేసుకోకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ రాజీవ్ సింఘ్ రఘువంశి ఆదేశించారు. మారియన్ తోపాటు మరో రెండు భారత ఫార్మా కంపెనీలు తయారు చేసిన దగ్గు మందు తాగడం వల్ల ఉజ్బెకిస్థాన్, గాంబియా, కామెరూన్ లో గతేడాది మొత్తం మీద 141 చిన్నారులు మరణించారు.

More Telugu News