Nadendla Manohar: టోఫెల్ తో టోపీ పెట్టి ప్రజాధనం లూటీ చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

  • ఏటా రూ.1052 కోట్లకు ఎసరు, 2027 వరకు పథకం ఎంఓయూ అన్న నాదెండ్ల
  • ఇంటికి వెళ్లిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందమన్న నాదెండ్ల మనోహర్
  • జగన్ పేరుతో విదేశీ పథకం తెచ్చి ఏం సాధించారు? అని ప్రశ్న
Nadendla Manohar blames ysrcp government videshi vidya scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట భారీ దోపిడీకి తెరతీసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణ పేరుతో ఈటీఎస్ అనే సంస్థకు 2027 వరకు ప్రతి సంవత్సరం రూ.1052 కోట్లు దోచిపెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరిట దోచుకుంటోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం 40 వేలమందికి మాత్రమే అమెరికా వీసాలు ఇస్తోందని, కానీ ప్రభుత్వం లక్షలాది మందికి శిక్షణ ఇస్తామని చెప్పడం ఏమిటి? అని ప్రశ్నించారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఈ ప్రభుత్వం కేవలం 340 మందిని మాత్రమే విదేశాలకు పంపించిందన్నారు. టోఫెల్‌తో టోపీ పెట్టి, ప్రజాధనం లూటీ చేస్తున్నారన్నారు. విచిత్రమైన పథకంతో ఖజానాకు కన్నం వేసే ప్రయత్నమన్నారు. 3 నుంచి పదిమంది విద్యార్థులకు టోఫెల్ పరీక్ష ఏమాత్రం ఉపయోగపడదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లిపోయే సర్కార్ హడావుడిగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జగన్ పేరుతో విదేశీ విద్యా పథకం తెచ్చి ఏం సాధించారు? అని ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరోసారి మోసానికి సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరుగుతూ ఎస్సీ, ఎస్టీ, బీసి నేతలను బస్సుయాత్ర చేయాలని ఆదేశించారన్నారు. బస్సుయాత్రలో జగన్ కూడా పాల్గొనాలని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ప్రత్యక్షంగా చూడాలన్నారు. కేవలం ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారన్నారు.

More Telugu News