Hero Vijay: రూ.1.5 కోట్ల ఐటీ జరిమానాపై హీరో విజయ్ పిటిషన్... మద్రాస్ హైకోర్టులో విచారణ వాయిదా

  • అదనపు ఆదాయంపై వివరాలు సమర్పించని విజయ్
  • భారీ జరిమానా వడ్డించిన ఆదాయ పన్ను శాఖ
  • మద్రాస్ హైకోర్టులో గతేడాది హీరో విజయ్ రిట్ పిటిషన్
Madras High Court adjourns hearing on hero Vijay writ petition

ఆదాయ పన్ను శాఖ తనకు రూ.1.5 కోట్ల జరిమానా విధించడంపై తమిళ హీరో విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. విజయ్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబరు 30కి వాయిదా వేసింది. 

2015-16 సీజన్ లో అదనపు ఆదాయానికి సంబంధించిన వివరాలను విజయ్ సమర్పించలేదటూ ఐటీ విభాగం భారీ జరిమానా వడ్డించింది. దీనిపై హీరో విజయ్ గతేడాది జూన్ 30న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టి విచారణలో హీరో విజయ్ తరఫు న్యాయవాది కొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ రామస్వామి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. 

పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ విభాగం గతంలో హీరో విజయ్ నివాసంలో సోదాలు చేపట్టింది. ఐటీ రిటర్నులు సమర్పించే సమయంలో విజయ్ తన పూర్తి ఆదాయానికి సంబంధించిన వివరాలు చూపలేదనేందుకు తగిన ఆధారాలను ఆ సోదాల్లో ఐటీ విభాగం గుర్తించింది. ఆ మేరకు విజయ్ నివాసం నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 

2015లో విజయ్ హీరోగా 'పులి' చిత్రం వచ్చింది. అయితే ఈ చిత్ర నిర్మాతలు హీరో విజయ్ కి రూ.4.93 కోట్లు నగదు రూపంలో ఇచ్చారు. మరో రూ.16 కోట్లు చెక్ రూపంలో ఇచ్చారు. అయితే, నిర్మాతలు నగదు రూపంలో ఇచ్చిన డబ్బుకు మాత్రమే టీడీఎస్ చెల్లించిన విజయ్, చెక్ రూపంలో ఇచ్చిన మొత్తానికి టీడీఎస్ చెల్లించలేదని ఐటీ విభాగం గుర్తించింది. దాంతో విజయ్ పై ఆదాయ పన్ను శాఖ రూ.1.5 కోట్ల భారీ జరిమానా విధించింది.

More Telugu News