Sri Lanka: సెంచరీలతో విరుచుకుపడిన మెండిస్, సమరవిక్రమ... పాకిస్థాన్ ముందు అదిరిపోయే టార్గెట్

Sri Lanka set Pakistan huge target after Mendes and Samarawickrama
  • వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ × శ్రీలంక
  • హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు

వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదిక. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక భారీ స్కోరు సాధించింది. సూపర్ ఫామ్ లో ఉన్న కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ సమరవిక్రమ సూపర్ సెంచరీలు సాధించడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు సాధించింది. 

కుశాల్ మెండిస్ 77 బంతుల్లోనే 122 పరుగులు చేయడం విశేషం. మెండిస్ స్కోరులో 14 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయంటే, పాక్ బౌలింగ్ ను అతడు ఎలా తుత్తునియలు చేశాడో అర్థమవుతుంది. కాగా, మెండిస్ శ్రీలంక తరఫున వరల్డ్ కప్ లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. 

మరో ఎండ్ లో సమరవిక్రమ సైతం విరుచుకుపడ్డాడు. సమరవిక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేశాడు. వీరిద్దరి విజృంభణతో షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ లతో  కూడిన పాక్ బౌలింగ్ విభాగం డీలా పడిపోయింది. 

అంతకుముందు, లంక ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (51) అర్ధసెంచరీతో బాధ్యతాయుతంగా ఆడాడు. లంక ఇన్నింగ్స్ లో ధనంజయ డిసిల్వా 25 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లు విసిరి 71 పరుగులు ఇచ్చాడు. హరీస్ రవూఫ్ 2, షహీన్ అఫ్రిది 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. 

ఇక, 345 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ కు శుభారంభం లభించలేదు. ఆ జట్టు 37 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 12, కెప్టెన్ బాబర్ అజామ్ 10 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు లంక లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక ఖాతాలో చేరాయి.

 ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 36, మహ్మద్ రిజ్వాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News