వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న న్యూజిలాండ్
- నేడు నెదర్లాండ్స్ పై 99 పరుగుల తేడాతో కివీస్ ఘనవిజయం
- తొలుత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసిన న్యూజిలాండ్
- 46.3 ఓవర్లలో 223 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్
- మిచెల్ శాంట్నర్ కు 5 వికెట్లు
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది.
కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 5 వికెట్లతో డచ్ జట్టు వెన్నువిరిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్ గా శాంట్నర్ ఘనత సాధించాడు. మాట్ హెన్రీ 3, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు.
నెదర్లాండ్స్ జట్టులో కోలిన్ అకెర్ మన్ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 30, సైబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్ 29, తేజ నిడమనూరు 21 పరుగులు సాధించారు.