KL Rahul: విన్నింగ్ సిక్స్ కొట్టాక షాక్‌తో రాహుల్ ఎందుకు కూలబడ్డాడు?

  • ఆస్ట్రేలియాపై గెలిచి ప్రపంచకప్‌ ప్రస్థానాన్ని ప్రారంభించిన భారత్
  • 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ జట్టును ఆదుకున్న కోహ్లీ, రాహుల్
  • 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్
Why KL Rahul Gave Shocked Reaction After Hitting Winning Runs

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రెండు పరుగులకే ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ వికెట్లను కోల్పోయింది. ఖాతా కూడా తెరవకుండానే ముగ్గురూ పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత్ గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఆసీస్ గెలుపు ఆశలను వమ్ము చేశారు.

వికెట్ల వద్ద పాతుకుపోయి మ్యాచ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కోహ్లీ 85 పరుగులు చేసి సెంచరీ ముంగిట అవుట్ కాగా, రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన రాహుల్ ఆ వెంటనే వికెట్ల వద్ద షాక్‌తో కూలబడిపోయాడు. జట్టును గెలిపించాక కూడా రాహుల్ అలా షాక్‌తో ఎందుకు కూలబడిపోయాడా? అన్నది అటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు, ఇటు టీవీల్లో మ్యాచ్ తిలకిస్తున్న వారికి అర్థం కాలేదు.

రాహుల్ అలా షాక్‌కు గురికావడం వెనక పెద్ద కారణమే ఉంది. 41 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 91 పరుగులు, పాండ్యా 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. జట్టు గెలపునకు ఐదు పరుగులు అవసరం కాగా శతకానికి రాహుల్ 9 పరుగుల దూరంలో ఉన్నాడు. కమిన్స్ వేసిన 42వ ఓవర్ తొలి బంతికి రాహుల్ పరుగులేమీ తీయలేదు. రెండో బంతికి ఫోర్ కొట్టి, మూడో బంతిని సిక్స్ కొట్టడం ద్వారా సెంచరీ పూర్తిచేసుకోవాలని రాహుల్ భావించాడు. కమిన్స్ వేసిన రెండో బంతిని బలంగా బౌండరీకి బాదినా టైమింగ్ సరిగ్గా కుదరడం వల్ల అది ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. అంతే, భారత్ గెలిచింది. కానీ, రాహుల్ మాత్రం ఈ అనూహ్య పరిణామానికి షాక్‌గురయ్యాడు. సెంచరీ చేజారినందుకు షాక్‌తో వికెట్ల వద్ద కుప్పకూలిపోయాడు.

More Telugu News