Venkaiah Naidu: సమకాలీన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • హైదరాబాదులో సిటిజెన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు
  • కండువాలు మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారని వెల్లడి
  • ఒకే పార్టీలో ఉండి నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడాలని పిలుపు
Venkaiah Naidu comments on present day politics

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భుజంపై కండువాలు  మార్చినంత సులభంగా నాయకులు పార్టీలు మారుతున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో జరిగిన సిటిజెన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ నేత పార్టీ మారినప్పుడు, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి కూడా రాజీనామా చేయాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కోట్లు ఉంటేనే ఓట్లు  అనే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. కానీ, సిద్ధాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్లే ప్రయోజనం ఉంటుందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో  ఉండి పోరాటం చేయాలని వెంకయ్య స్పష్టం చేశారు. 

ఇవాళ చట్టసభల్లో మంచిగా మాట్లాడితే న్యూస్ కావడంలేదని, వక్రంగా మాట్లాడితేనే అది న్యూస్ అవుతుందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి రావాలంటే బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదని, అధ్యయనం చేయాలని సూచించారు.

More Telugu News