Israel: ఇజ్రాయెల్ లో ఉగ్రదాడులు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయి: ప్రధాని మోదీ

  • ఇజ్రాయెల్ పై ఉన్నట్టుండి విరుచుకుపడిన హమాస్ మిలిటెంట్ గ్రూపు
  • కేవలం 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడులు
  • భీకరస్థాయిలో ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
  • ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించిన భారత ప్రధాని మోదీ
Modi reacts to terror attack in Israel

హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ లో చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతున్నట్టు వచ్చిన వార్తలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇజ్రాయెల్ లో ఉగ్రదాడుల వార్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. ఉగ్రదాడుల్లో బలైన అమాయకుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో స్పందించారు. 

కొంతకాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అయితే హమాస్ సంస్థ ఈ ఉదయం నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. కేవలం 20 నిమిషాల్లో హమాస్ గ్రూపు 5 వేల రాకెట్లు ప్రయోగించినట్టు తెలుస్తోంది. అటు, ఇజ్రాయెల్ లోకి హమాస్ ఉగ్రవాదులు భారీగా చొరబడినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావొద్దని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హెచ్చరికలు జారీ చేసింది. 

కాగా, ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోని సీడెరట్ నగరంలో హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరపగా, భారీగా ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ భీకరస్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పాలస్తీనాలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. 

ఇజ్రాయెల్ ఇవాళ్టి దాడులను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇక, హమాస్ రాకెట్ దాడులతో పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గలాంట్ అన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పక విజయం సాధిస్తుందని తెలిపారు.

More Telugu News