VH: హరిరామ జోగయ్య పేరిట వీహెచ్ కు కాల్ చేసి డబ్బు అడిగిన సైబర్ నేరగాడు

  • ఆపదలో ఉన్నానంటూ హరిరామ జోగయ్య పేరిట ఫోన్ కాల్
  • గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని వీహెచ్ కు అభ్యర్థన
  • హరిరామ జోగయ్య నివాసానికి ఓ వ్యక్తిని పంపి వాకబు చేసిన వీహెచ్
  • తనకు వచ్చింది సైబర్ నేరగాడి కాల్ అని నిర్ధారణ... పోలీసులకు ఫిర్యాదు
VH gets fake call in the name of Harirama Jogaiah

సైబర్ నేరగాళ్లు రాజకీయ నేతల పేర్లను కూడా వాడుకుంటున్నారు. ఓ సైబర్ నేరగాడు సీనియర్ రాజకీయవేత్త హరిరామ జోగయ్య పేరిట తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ కు ఫోన్ చేసి డబ్బు అడిగిన సంఘటన నివ్వెరపరుస్తోంది. ఆ వ్యక్తి తాను హరిరామ జోగయ్యను అంటూ వీహెచ్ కు కాల్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని, వెంటనే గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని కోరాడు. 

అయితే, ఈ ఫోన్ కాల్ పై వీహెచ్ కు అనుమానం వచ్చింది. ఆయన ఓ వ్యక్తిని హరిరామ జోగయ్య నివాసానికి పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. తనకు వచ్చింది సైబర్ మోసగాడి కాల్ అని తెలుసుకుని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సైబరాబాద్ పోలీసులకు కూడా ఈ ఫోన్ కాల్ గురించి సమాచారం అందించారు. 

వీహెచ్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ ఫోన్ కాల్ ఖమ్మం నుంచి వచ్చినట్టు గుర్తించారు. సైబర్ నేరగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News