KTR: ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టండి, జగనన్నతో మాట్లాడుతా: కేటీఆర్ పిలుపు

KTR suggests nri techi companies to invest in andhra pradesh also
  • వరంగల్‌తో పాటు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలన్న కేటీఆర్
  • అక్కడా ఎన్నారైలు ఐటీ సంస్థలు ఏర్పాటు చేయాలని సూచన
  • బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలుగువాళ్లేనని వెల్లడి
  • అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు వాళ్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాడ్రాంట్ సాఫ్ట్ వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్దగా తేడా ఉండదన్నారు. ఐటీ రంగంలో భవిష్యత్తు అంతా టైర్ 2 నగరాలదే అన్నారు.

వరంగల్ మాత్రమే కాకుండా ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలన్నారు. అక్కడ కూడా ఎన్నారైలు ఐటీ సంస్థలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కావాలంటే జగనన్నకు చెప్పి మీకు జాగా ఇప్పిస్తానని చెప్పారు. బెంగళూరు ఐటీ రంగంలో నలభై శాతం మన తెలుగువాళ్లే ఉన్నారన్నారు. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగువాళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉన్నచోటనే యువతకు ఉపాధి దక్కాలన్నారు. క్వాడ్రాంట్ కంపెనీ నెల్లూరులోనూ పెట్టాలని, అవసరమైతే జగనన్నతో మాట్లాడుతానన్నారు.

టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు. అధిక జనాభా నష్టం అని చెప్పారు కానీ అది అబద్ధమన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరంగల్‌కు ఇంకా చాలా కంపెనీలు రావాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్‌కు వేగవంతమైన రైలు వస్తుందని, దీంతో కంపెనీలు ఎక్కువగా వస్తాయన్నారు.
KTR
Andhra Pradesh
Telangana

More Telugu News