Telangana: విషప్రయోగంతో 35కు పైగా కోతులను చంపిన ఆగంతుకులు.. గ్రామస్తుల్లో ఆగ్రహం!

over 35 monkey killed with poison in peddapalli district of Telangana
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వెలుగులోకొచ్చిన ఘటన
  • కోతుల బెడత తప్పించేందుకు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు
  • మైనింగ్ కారణంగా కొండలు మాయమవుతుండటంతో కోతులు గ్రామాలవైపు వస్తున్నాయన్న స్థానికులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 
మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహాం పెల్లుబుకుతోంది. పథకం ప్రకారం కోతులను మట్టుబెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. 

ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు చెబుతున్నారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం అందించారు. అటుపై సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. 

ఈ హేయమైన చర్యకు పాల్పడిందెవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూగజీవాలకు తుది వీడ్కోలు పలుకుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Telangana
Peddapalli District
Crime News

More Telugu News